Dhoni- Chahar: ధోనీ నుంచి అక్షింతలు పడ్డాయి.. అభినందనలూ వచ్చాయి: దీపక్ చాహర్‌

ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) విజేతను తేల్చే మ్యాచ్‌ గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్‌ (GT vs CSK) మధ్య అహ్మదాబాద్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ను చిత్తుచేయడంలో సీఎస్‌కే బౌలర్‌ దీపక్ చాహర్ కీలక పాత్ర పోషించాడు. మరోసారి అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో గతంలో తన బౌలింగ్‌పై ధోనీ స్పందనను గుర్తు చేసుకున్నాడు. 

Published : 28 May 2023 11:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) జట్టులో సీనియర్‌ పేసర్‌ దీపక్ చాహర్. ఐదేళ్ల నుంచి సీఎస్‌కేతో ఉంటున్న చాహర్‌కు 2019 సీజన్‌ మాత్రం ఎప్పటికీ మరువలేనిది. ఆ ఏడాది జరిగిన ఐపీఎల్‌ టోర్నీలో 17 మ్యాచుల్లో 22 వికెట్లు తీసి ఉత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అయితే, అదే సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెత్‌ ఓవర్‌ వేసే సందర్భంగా కెప్టెన్ ధోనీ ఆగ్రహానికి గురైనప్పటికీ.. అద్భుతంగా బంతులను సంధించడంతో అభినందనలూ అందుకున్నట్లు దీపక్ చాహర్‌ తెలిపాడు. డ్వేన్ బ్రావో గాయపడటంతో తొలిసారి డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేసే అవకాశం వచ్చిందని గుర్తు చేసుకున్నాడు.  పంజాబ్ 12 బంతుల్లో 39 పరుగులు చేయాల్సిన తరుణంలో వరుసగా రెండు బీమర్లను సంధించడంతో ధోనీ కాస్త కఠినంగా చాహర్‌కు సూచనలు చేశాడు. ఆ తర్వాత మిగిలిన ఐదు బంతులకు కేవలం ఐదు పరుగులే ఇచ్చినట్లు దీపక్ చెప్పాడు. 

‘‘అప్పుడు పంజాబ్‌ బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. నేను తొలిసారి డెత్ ఓవర్‌ వేస్తున్నా. సాధారణంగా మా జట్టులో డ్వేన్ బ్రావో, శార్దూల్ ఉన్నప్పుడు వారినే డెత్‌ ఓవర్లలో బౌలింగ్ వేసేందుకు ధోనీ ఎంచుకుంటాడు. అయితే, బ్రావో గాయపడటంతో మొదటిసారి నాకు డెత్ ఓవర్‌ వేసేందుకు అవకాశం వచ్చింది. నెట్స్‌లో నా బౌలింగ్‌ చూసి ధోనీ ఛాన్స్‌ ఇచ్చాడు. పంజాబ్‌ ఆ సమయంలో 39 పరుగులు చేయాలి. తొలి బంతిని స్లోగా వేశా. కానీ, హై ఫుల్‌టాస్‌గా పడింది. ఆ తర్వాత బంతి కూడా ఇలానే వేశా. అప్పుడే అనుకున్న ఇక నాకు అవకాశం రాదని. నా డెత్‌ ఓవర్‌ బౌలింగ్‌ కెరీర్‌ ముగిసిపోయినట్లేననిపించింది. 

ధోనీ వెంటనే నా దగ్గరకు వచ్చాడు. ‘నీకు ప్రతిదీ తెలుసు. కాస్త తెలివిగా ప్రవర్తించు. ఇలా ఎందుకు బౌలింగ్‌ చేస్తున్నావు’ అని అన్నాడు. అప్పుడు కాస్త ఆలోచించా. నా కెరీర్‌కే ముగింపు పడుతుందా..? అని భయపడ్డా. కానీ, తర్వాత ఐదు బంతుల్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చా. దీంతో మ్యాచ్‌ అనంతరం నన్ను కౌగిలించుకుని అభినందించాడు’’ అని దీపక్‌ తెలిపాడు. 

వరుసగా రెండు బీమర్లు వేసినప్పటికీ చాహర్‌ను అంపైర్‌ బౌలింగ్‌కు అనుమతించాడు. దీనికి కారణం ఆ రెండు కూడా స్లో బంతులే. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 22 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని