Krunal - Deepak: కృనాల్‌ నా సోదరుడు లాంటివాడు.. : దీపక్‌ హుడా

కృనాల్‌ పాండ్య తనకు సోదరుడి లాంటివాడని లఖ్‌నవూ బ్యాట్స్‌మన్‌ దీపక్‌ హుడా అన్నాడు. గతేడాది వీరిమధ్య దేశవాళీ క్రికెట్‌లో గొడవలు జరిగి పెద్ద దుమారం రేగింది. అయితే, ప్రస్తుతం జరుగుతోన్న మెగా టీ20 లీగ్‌లో...

Published : 09 Apr 2022 01:59 IST

(Photos: Deepak, Krunal Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: కృనాల్‌ పాండ్య తనకు సోదరుడిలాంటివాడని లఖ్‌నవూ బ్యాట్స్‌మన్‌ దీపక్‌ హుడా అన్నాడు. గతేడాది వీరిమధ్య దేశవాళీ క్రికెట్‌లో గొడవలు జరిగి పెద్ద దుమారం రేగింది. అయితే, ప్రస్తుతం జరుగుతోన్న మెగా టీ20 లీగ్‌లో ఒకే ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్న వీరిద్దరూ ఇప్పుడు కలిసిపోయారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకరినొకరు హత్తుకొని కనిపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ విషయంపై స్పందించిన హుడా తాము ఇప్పుడు పాత సంగతుల్ని పట్టించుకోవడం లేదన్నాడు.

‘కృనాల్‌ నాకు సోదరుడి లాంటివాడు. సోదరులు కొట్లాడుకుంటారు. అయితే, ఇప్పుడు ఇద్దరం లఖ్‌నవూను విజేతగా నిలపాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఆడుతున్నాం. ఫిబ్రవరిలో జరిగిన వేలం పాటను నేను ప్రత్యక్షంగా చూడలేదు. దీంతో అందరి లాగే మేం కూడా జట్టు ఏర్పాటు చేసిన హోటల్‌లోనే కలుసుకున్నాం. గతంలో జరిగిందేదో జరిగింది. దాని గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు మేం ఒకే జట్టు తరఫున ఆడుతున్నాం. మా లక్ష్యం ఒక్కటే’ అని హుడా పేర్కొన్నాడు.

కాగా, గతేడాది దేశవాళీ క్రికెట్‌లో వీరిద్దరి మధ్యా గొడవ జరిగింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ప్రారంభానికి ముందు బరోడా కెప్టెన్‌గా ఉన్న కృనాల్‌ పాండ్య.. అందరి ముందూ తనని దూషించాడని, తనను ఆ జట్టులో ఆడనివ్వనని బెదిరించాడని దీపక్‌ పేర్కొన్నాడు. అప్పుడు ఇరువురూ దూషించుకున్నారు. ఈ నేపథ్యంలోనే దీపక్‌ ఆ టోర్నీ ఆరంభానికి ముందు బయోబబుల్‌ నుంచి బయటకు వెళ్లాడు. తర్వాత రాజస్థాన్‌ జట్టులో చేరి ఆ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో ఇద్దర్నీ లఖ్‌నవూ జట్టు కొనుగోలు చేసింది. దీంతో ఇప్పుడు ఒకే జట్టులో కలిసి ఆడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని