Hooda : పఠాన్‌ బ్రదర్స్‌ నుంచి చాలా నేర్చుకున్నా.. కుంబ్లే భాయ్‌కు థ్యాంక్స్: దీపక్‌ హుడా

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన టీమ్‌ఇండియా ఆటగాడు దీపక్‌ హుడా.. కష్ట సమయంలో..

Published : 31 Jan 2022 01:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన టీమ్‌ఇండియా ఆటగాడు దీపక్‌ హుడా.. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన పఠాన్‌ సోదరులకు కృతజ్ఞతలు తెలిపాడు. విజయ్‌ హజారే, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలలో అద్భుత ప్రదర్శన చేయడంతో మళ్లీ వన్డే జట్టులోకి వచ్చే అవకాశం దీపక్‌కి కలిగింది. గతంలో శ్రీలంకతో నిదహాస్ ట్రోఫీ జట్టులోనూ సభ్యుడైనప్పటికీ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేకపోయాడు. ‘‘నేను టీమ్‌ఇండియాకు ఎంపిక కావడంపై చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయి. తుది జట్టులో ఆడతానో లేదో కూడా తెలియదు. అయితే ఇర్ఫాన్‌ ఒకటే మాట చెప్పాడు. వేచి చూస్తూ ఉండు సమయం అదే వస్తుంది. నేను ఇర్ఫాన్, యూసఫ్‌ నుంచి చాలా విషయాలను తెలుసుకున్నా. ప్రశాంతంగా ఉండాలని వారిద్దరి దగ్గర నుంచి నేర్చుకున్నా. అయితే యువకుడిగా అలా ఉండటం కష్టమైంది. ప్రశాంతంగా ఉండలేకపోవడం కూడానూ నా ఆటకు ఆటంకం కలిగించింది. అందుకే దానికోసం చాలా కష్టపడ్డా’’ అని దీపక్‌ హుడా వివరించాడు.

ఆటగాడిగా సన్నద్ధత కావడానికి ఇర్ఫాన పఠాన్‌ తనకు ఎంతో సహకరించాడని దీపక్ తెలిపాడు. నిజాయితీని ప్రదర్శించడంలో సహాయపడిందని పేర్కొన్నాడు. ‘‘నేను తప్పకుండా ఇర్ఫాన్‌ భాయ్‌ను గుర్తుకు తెచ్చుకోవాలి. సన్నద్దత ఎంత ముఖ్యమో చాలా చక్కగా చెప్పాడు. వేరేవారి నుంచి ఏమీ ఆశించకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. అది జిమ్ అయినా.. సాధన సెషన్స్‌లోనైనా సరే కష్టపడి పని చేయడమే నేర్చుకున్నా. దానికి తగ్గ ఫలితం ఇప్పుడొచ్చింది’’ అని  దీపక్‌ హుడా ఆనందం వ్యక్తం చేశాడు. బరోడాకు ఆడుతున్నప్పుడు ఎత్తుపల్లాలను అనుభవించానని, అలానే వేరే రాష్ట్రానికి (రాజస్థాన్‌) మారినప్పుడు కూడా వారిద్దరూ ఎంతో సపోర్ట్‌గా నిలిచారన్నాడు. అలానే పంజాబ్‌ కింగ్స్‌ ప్రధాన కోచ్ అనిల్‌ కుంబ్లేకీ ధన్యవాదాలు తెలిపాడు. తన మీద నమ్మకంతో రెండు సీజన్లలో అవకాశం కల్పించడంలో కుంబ్లే కీలక పాత్ర పోషించాడని వెల్లడించాడు. దీపక్ హుడా గతంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కూ ఆడాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని