T20 Challenge: ఓడినా ఫైనల్‌కు చేరిన దీప్తి శర్మ జట్టు

మహిళల టీ20 ఛాలెంజ్‌ లీగ్‌ దశ ముగిసింది. మూడు జట్లు తలో మ్యాచ్‌ నెగ్గి, మరో మ్యాచ్‌ ఓడగా.. మెరుగైన రన్‌రేట్‌తో సూపర్‌నోవాస్‌, వెలాసిటీ ముందంజ వేశాయి. ట్రయల్‌బ్లేజర్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం చివరి లీగ్‌ మ్యాచ్‌లో ట్రయల్‌ బ్లేజర్స్‌ 16 పరుగుల తేడాతో వెలాసిటీని ఓడించింది.

Updated : 27 May 2022 02:59 IST

హిళల టీ20 ఛాలెంజ్‌ లీగ్‌ దశ ముగిసింది. మూడు జట్లు తలో మ్యాచ్‌ నెగ్గి, మరో మ్యాచ్‌ ఓడగా.. మెరుగైన రన్‌రేట్‌తో హర్మన్‌ టీమ్‌, దీప్తి శర్మ జట్టు ముందంజ వేశాయి. స్మృతీ మంధాన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం చివరి లీగ్‌ మ్యాచ్‌లో స్మృతీ మంధాన జట్టు 16 పరుగుల తేడాతో దీప్తి శర్మ జట్టును ఓడించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దీప్తి శర్మ టీమ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులే చేసింది. అయితే రన్‌రేట్‌లో పైచేయి సాధించి ముందుంజ వేసింది. ఫైనల్‌ చేరాలంటే స్మృతీ సేన ప్రత్యర్థిని.. 158 పరుగులు, అంతకంటే తక్కువకే పరిమితం చేయాల్సింది. తొలి మ్యాచ్‌లో హర్మన్ జట్టు చేతిలో స్మృతీ టీమ్‌ ఓటమి పాలవగా.. తర్వాతి మ్యాచ్‌లో హర్మన్‌ టీమ్‌పై దీప్తి శర్మ జట్టు నెగ్గిన సంగతి తెలిసిందే. ఫైనల్‌ చేరాలంటే ఎక్కువ తేడాతో నెగ్గాల్సి ఉన్న నేపథ్యంలో చివరి లీగ్‌ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన స్మృతీ సేన.. ధాటిగా ఆడింది. కెప్టెన్‌ స్మృతి మంధాన (1) తొలి ఓవర్లోనే వెనుదిరిగినా.. మరో ఓపెనర్‌, తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (73; 47 బంతుల్లో 7×4, 4×6)తో పాటు జెమీమా రోడ్రిగ్స్‌ (66; 44 బంతుల్లో 7×4, 1×6) చెలరేగి ఆడి భారీ భాగస్వామ్యం (113) నెలకొల్పడం.. చివర్లో హేలీ మాథ్యూస్‌ (27), సోఫియా డంక్లీ (19) కూడా సత్తా చాటడంతో 5 వికెట్లకు 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రత్యర్థి బౌలర్లలో సిమ్రన్‌ బహదూర్‌ (2/31) రాణించింది. అనంతరం షెఫాలి (29; 15 బంతుల్లో 5×4), యాస్తిక (19) దీప్తి శర్మ జట్టుకు శుభారంభాన్నందించారు. వీళ్లిద్దరూ వరుస ఓవర్లలో వెనుదిరగడం, లారా వోల్వార్ట్‌ (17), దీప్తి శర్మ (2) కూడా ఎక్కువ సేపు నిలవకపోవడంతో కష్టమే అనిపించింది. కానీ నాగాలాండ్‌ అమ్మాయి కిరణ్‌ ప్రభు (69; 34 బంతుల్లో 5×4, 5×6) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును ఫైనల్‌కు చేర్చింది. బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌ (2/33), రాజేశ్వరి గైక్వాడ్‌ (2/44), సోఫియా డంక్లీ (1/8) ఆకట్టుకున్నారు. ఫైనల్‌ శనివారం జరుగుతుంది.

స్మృతీ మధాన జట్టు: 190/5 (సబ్బినేని మేఘన 73, జెమీమా రోడ్రిగ్స్‌ 66; హేలీ మాథ్యూస్‌ 27; సిమ్రాన్‌ బహదూర్‌ 2/31, కేట్‌క్రాస్‌ 1/27, అయబోంగా 1/27, స్నేహ్‌ రాణా 1/37)

దీప్తి శర్మ టీమ్‌: 174/9 (కిరణ్‌ ప్రభు 69, షెఫాలి 29; పూనమ్‌ యాదవ్‌ 2/33, రాజేశ్వరి గైక్వాడ్‌ 2/44, సోఫియా డంక్లీ 1/8, హేలీ మాథ్యూస్‌ 1/20)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని