Deepthi Sharma: నెట్టింట మన్కడింగ్‌ రచ్చ.. రెండు వర్గాలుగా చీలిన క్రికెటర్లు

ఛార్లీ డీన్‌ను దీప్తి శర్మ రనౌట్‌(మన్కడింగ్‌) చేయడంపై క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 25 Sep 2022 17:50 IST

లండన్‌: ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ ఛార్లీ డీన్‌ను దీప్తి శర్మ రనౌట్‌ (మన్కడింగ్‌) చేయడంపై క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీప్తి నిబంధనల ప్రకారమే ఆడిందని కొందరు సమర్థిస్తోంటే.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ మరికొందరు వాదిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ చర్చ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఈ అంశంపై మాజీ క్రికెటర్లు ఏమన్నారంటే... 


‘‘ఇది చాలా సింపుల్‌. బౌలర్‌ రన్‌అప్‌ మొదలుపెట్టిన సమయం నుంచే బంతి ఆటలోకి వచ్చినట్టు. ఆ క్షణం నుంచే బ్యాటర్‌, నాన్‌ స్ట్రైకర్‌ స్థానంలో ఉన్నవారు బంతిని గమనిస్తూ ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రత్యర్థి జట్టు మిమ్మల్ని ఔట్‌ చేస్తుంది’’ 

- వసీమ్‌ జాఫర్‌


‘‘ఈ ఇంగ్లిష్‌ వారు ఇంత పేలవంగా ఔటవ్వడం చూస్తుంటే ఫన్నీగా అనిపిస్తుంటుంది’’

- వీరేంద్ర సెహ్వాగ్‌ 


‘‘నేను ఎవరి పక్షాన లేను. కానీ బౌలర్లు బంతిని వేసేప్పుడు గీత దాటకుండా ఉండాలంటూ వారికి ఎలాగైతే నిబంధనలు విధించారో అదేవిధంగా బ్యాటింగ్ చేసేవారు సైతం ఇదే నిబంధనను పాటించాలి. అందరం నిబంధనల ప్రకారం అడితే బాగుంటుంది’’

- టబ్రైజ్‌ షంసీ


‘‘కచ్చితంగా ఆటలో ఉన్నవారెవ్వరూ ఇది సరైందేనని ఆమోదించరు’’

- సామ్‌ బిల్లింగ్స్‌


‘‘దీప్తి శర్మకు బంతిని వేసే ఉద్దేశమే లేదని ఇక్కడే తెలిసిపోయింది’’

- జేమ్స్‌ ఆండర్సన్‌ 


‘‘మన్కడింగ్‌ ఔట్‌ గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడది ఆటలో భాగంగా ఐసీసీ నిర్ణయించింది. ఇప్పడు బ్యాటర్‌ను మన్కడింగ్‌ ద్వారా ఔట్‌ చేయొచ్చు. ఈ విషయంలో ఎవరైనా కామెంట్‌ చేసేముందు క్రికెట్‌ రూల్స్‌ ఓసారి చూసుకుంటే బాగుంటుంది’’

- మాంటీ పనేసర్‌


ఒకప్పుడు బంతి వేయకముందే క్రీజు దాటే నాన్‌ స్ట్రైకర్‌ను రనౌట్‌ చేయడం (మన్కడింగ్‌) అన్యాయం అనేవారు. అయితే ఇటీవల ఆటకు సంబంధించిన కొన్ని నిబంధనలు మార్పు చేస్తూ ఐసీసీ దీనిని రనౌట్‌ జాబితాలో చేర్చింది. అక్టోబరు 1 నుంచి ఈ నిబంధనల మార్పు అమల్లోకి వస్తుంది. మన్కడింగ్‌ను న్యాయంగా ఔట్‌ చేసినట్టుగానే పరిగణించాలంటూ భారత ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ లాంటి వారు ఎంతో కాలంగా డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఐసీసీ అధికారికం అని నిబంధనలు మార్చినా.. ఇలా భిన్నాభిప్రాయాలు వస్తుండటం గమనార్హం. శనివారం లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో సీనియర్‌ పేసర్‌ ఝులన్‌ గోస్వామికి ఘనంగా వీడ్కోలు పలికారు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts