IPL : దిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా అజిత్ అగార్కర్‌

టీమిండియా మాజీ ఆటగాడు అజిత్‌ అగార్కర్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్)లో దిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ దిల్లీ క్యాపిటల్స్..

Updated : 24 Feb 2022 12:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమిండియా మాజీ ఆటగాడు అజిత్‌ అగార్కర్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్)లో దిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టుకు కోచ్‌ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ దిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అజిత్ అగార్కర్‌ శ్రీలంకతో జరుగనున్న టీ20 సిరీస్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ సిరీస్‌ ముగిసిన వెంటనే అగార్కర్‌ దిల్లీ జట్టులో చేరనున్నాడు. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌, హెడ్ కోచ్‌ రికీ పాంటింగ్‌లతో కలిసి పని చేయనున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్‌ అమ్రే దిల్లీ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా, జేమ్స్ హోప్స్ బౌలింగ్ కోచ్‌గా పని చేస్తున్నారు.

‘దిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో ఓ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఆటగాడిగా దిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడాను. మళ్లీ ఇప్పుడు అదే జట్టుకు కోచ్‌గా పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన రిషభ్‌ పంత్ సారథ్యంలోని దిల్లీ జట్టు.. యువ ఆటగాళ్లతో చాలా బలంగా కనిపిస్తోంది. హెడ్‌ కోచ్ రికీ పాంటింగ్‌ క్రికెట్లో ఓ లెజెండ్‌. అలాంటి దిగ్గజ ఆటగాడితో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నాను’ అని అజిత్‌ అగార్కర్ పేర్కొన్నాడు. టీమిండియా తరఫున అజిత్‌ అగార్కర్ 26 టెస్టుల్లో.. 58 వికెట్లు, 191 వన్డేల్లో 288 వికెట్లు, 4 టీ20ల్లో 3 వికెట్లు పడగొట్టాడు. అగార్కర్ గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్), దిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్ల తరఫున ఆడిన విషయం తెలిసిందే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని