DDw vs UPWw: మెగ్ లానింగ్, జోనాస్సెన్ మెరుపులు.. యూపీ ముందు భారీ లక్ష్యం

మహిళల ప్రీమియర్ లీగ్‌ (WPL)లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌, యూపీ వారియర్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన దిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Published : 07 Mar 2023 21:32 IST

ముంబయి: మహిళల ప్రీమియర్ లీగ్‌ (WPL)లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌, యూపీ వారియర్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన దిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది.  కెప్టెన్‌ మెగ్  లానింగ్ (70; 42 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడైన ఆటతీరుతో అలరించి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించింది. అలీస్‌ కాప్సీ (21), షెఫాలీ వర్మ (17), మరిజేన్ కాప్ (16) పరుగులు చేశారు. చివర్లో జెమీమా రోడ్రిగ్స్‌ (34; 22 బంతుల్లో 4 ఫోర్లు), జెస్ జోనాస్సెన్ (42; 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచికొట్టారు. దిల్లీ బౌలర్లలో  షబ్నిమ్ ఇస్మాయిల్, రాజేశ్వరి గైక్వాడ్, మెక్‌గ్రాత్‌, సోఫీ ఎకిల్‌స్టోన్‌ తలో వికెట్ పడగొట్టారు.

లానింగ్ దూకుడు 

మొదటి రెండు ఓవర్లపాటు నెమ్మదిగా ఆడిన మెగ్ లానింగ్..  మూడో ఓవర్‌ నుంచి దూకుడు పెంచింది. మూడో ఓవర్‌లో ఓ సిక్సర్‌ బాదిన ఆమె.. షబ్నిమ్ వేసిన ఐదో ఓవర్‌లో ఒక ఫోర్‌, రెండు సిక్స్‌లు కొట్టింది. రాజేశ్వరి గైక్వాడ్ వేసిన తర్వాతి ఓవర్‌లో మూడు బౌండరీలు బాదింది. మొదటి వికెట్‌కు షెఫాలీతో కలిసి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. మెక్‌గ్రాత్‌ వేసిన ఏడో ఓవర్‌లో షెఫాలీ.. కిరణ్ నవ్‌గిరెకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. ఎకిల్ స్టోన్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో సిక్సర్ బాది మెగ్ లానింగ్ అర్ధ శతకం పూర్తి చేసుకుంది. ఆమె 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసింది. దూకుడుగా ఆడుతున్న లానింగ్‌ను రాజేశ్వరి గైక్వాడ్ ఔట్‌ చేసింది. ఆఖర్లో జెమీమా, జోనాస్సెన్ యూపీ బౌలర్లను ఊచకోత కోశారు. ముఖ్యంగా జోనాస్సెన్‌ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి జట్టు స్కోరు 200 దాటడంతో ప్రధాన పాత్ర పోషించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు