MIW vs DCW: చెలరేగిన దిల్లీ.. 9 వికెట్ల తేడాతో ముంబయిపై విజయం

ముంబయి ఇండియన్స్‌పై దిల్లీ క్యాపిటల్స్‌ ఘనవిజయం సాధించింది. 110 పరుగుల లక్ష్యాన్ని 9 వికెట్ల తేడాతో ఛేదించింది.

Updated : 20 Mar 2023 22:40 IST

ముంబయి: ముంబయి ఇండియన్స్‌ (MIW)తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ (DCW) ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుపై  9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబయి నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒకే ఒక్క వికెట్‌ కోల్పోయి 9 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్‌ మెగ్‌లాన్నింగ్‌ (32 నాటౌట్‌, 22 బంతుల్లో 4×4, 1×6), షఫాలీ వర్మ (33; 15 బంతుల్లో 6×4, 1×6), అలీస్‌ గ్యాప్సే (38 నాటౌట్‌, 17 బంతుల్లో 1×4, 5×6) సమష్టిగా చెలరేగిన వేళ ముంబయి లక్ష్యం చిన్నబోయింది. ముంబయి బౌలర్లలో హెయిలీ మ్యాథ్యూస్‌ ఒక వికెట్‌ సొంతం చేసుకుంది.

లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీ జట్టును ముంబయి ఏమాత్రం అడ్డుకోలేక పోయింది. బ్యాటర్లు ప్రారంభం నుంచే పరుగుల వరద పారించారు. బౌలింగ్‌ ఎవరిదా? అన్న దాంతో సంబంధం లేకుండా ఎడాపెడా బాదేశారు. అయితే జట్టు స్కోరు 56 పరుగుల వద్ద మ్యాథ్యూస్‌ వేసిన 4.3వ బంతికి షఫాలీ వర్మ స్టంపౌటయ్యింది. ముంబయి బౌలర్లలో సైకా ఇషాక్‌ రెండు ఓవర్లల్లో అత్యధికంగా 36 పరుగులు సమర్పించుకుంది. హెయిలీ మ్యాథ్యూస్‌ (27/1), వాంగ్‌ (20/0), బ్రంట్‌ (21/0) పరుగులు ఇచ్చారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 109 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (23), పూజా వస్త్రాకర్‌ (26), వాంగ్ (23), అమన్‌జోత్‌ కౌర్‌ (19) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. దిల్లీ బౌలర్లలో  మరిజన్నె, షిఖా పాండే,జోనాసేన్‌ తలో 2 వికెట్లు తీయగా.. అరుంధతి రెడ్డి ఒక వికెట్‌ పడగొట్టారు. ప్రారంభం నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన దిల్లీ జట్టు ముంబయిని స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు