T20 World Cup 2024: ఎదురులేని సఫారీ

ప్రపంచకప్‌ నాకౌట్‌ దశల్లో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడడం.. చేతుల్లో ఉన్న మ్యాచ్‌లను ఆ జట్టు పోగొట్టుకోవడం మామూలే. శుక్రవారం ఇంగ్లాండ్‌తో టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 మ్యాచ్‌లోనూ ఆ జట్టుకు అదే అనుభవం ఎదురవుతుందా అనిపించింది.

Updated : 22 Jun 2024 09:46 IST

సూపర్‌-8లో దక్షిణాఫ్రికా రెండో విజయం
సెమీస్‌కు చేరువ  
ఇంగ్లాండ్‌ ఓటమి

ప్రపంచకప్‌ నాకౌట్‌ దశల్లో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడడం.. చేతుల్లో ఉన్న మ్యాచ్‌లను ఆ జట్టు పోగొట్టుకోవడం మామూలే. శుక్రవారం ఇంగ్లాండ్‌తో టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 మ్యాచ్‌లోనూ ఆ జట్టుకు అదే అనుభవం ఎదురవుతుందా అనిపించింది. కానీ చేతిలో 6 వికెట్లుండగా, క్రీజులో దూకుడైన బ్యాటర్లను పెట్టుకుని 3 ఓవర్లలో 25 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉన్న ఇంగ్లాండ్‌కు సఫారీ బౌలర్లు కళ్లెం వేసి జట్టుకు విజయాన్నందించడం విశేషం. 

గ్రాస్‌ ఐలెట్‌

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 దశలో వరుసగా రెండో విజయంతో దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరువైంది. శుక్రవారం గ్రూప్‌-2లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. మొదట డికాక్‌ (65; 38 బంతుల్లో 4×4, 4×6), మిల్లర్‌ (43; 28 బంతుల్లో 4×4, 2×6)ల మెరుపులతో దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ఆర్చర్‌ (3/40) ఆకట్టుకున్నాడు. అనంతరం ఇంగ్లిష్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులే చేయగలిగింది. హ్యారీ బ్రూక్‌ (53; 37 బంతుల్లో 7×4), లివింగ్‌స్టన్‌ (33; 17 బంతుల్లో 3×4, 2×6)ల పోరాటం సరిపోలేదు. కేశవ్‌ మహరాజ్‌ (2/25), రబాడ (2/32) ఇంగ్లాండ్‌ను దెబ్బ తీశారు.

చేరువై.. దూరమై..: బలమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉన్న ఇంగ్లాండ్‌కు 164 పరుగుల లక్ష్యం ఏమూలకు సరిపోతుందిలే అనుకుంటే.. బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై పరుగులు చేయలేక, వికెట్లు కాపాడుకోలేక ఆ జట్టు ఇబ్బంది పడింది. విండీస్‌పై అదరగొట్టిన సాల్ట్‌ (11) రెండో ఓవర్లోనే వెనుదిరగ్గా.. బెయిర్‌స్టో (16) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ స్థితిలో బట్లర్‌ (17) మీదే ఆశలు నిలవగా.. కేశవ్‌ బంతికి భారీ షాట్‌ ఆడబోయిన ఇంగ్లిష్‌ కెప్టెన్‌ క్లాసెన్‌కు దొరికిపోయాడు. మొయిన్‌ అలీ (9) కూడా ఎంతోసేపు నిలవకపోవడం, సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోవడంతో ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పదనిపించింది. కానీ బ్రూక్, లివింగ్‌స్టన్‌ జోడీ సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి.. సమీకరణాన్ని తేలిక చేసేసింది. 15-17 ఓవర్ల మధ్య ఈ జోడీ ఏకంగా 52 పరుగులు రాబట్టింది. దీంతో 17 ఓవర్లకు 139/4తో ఇంగ్లాండ్‌ పటిష్ట స్థితికి చేరుకుంది. 3 ఓవర్లలో 25 పరుగులే అవసరమైన స్థితిలో లివింగ్‌స్టన్‌కు రబాడ చెక్‌ పెట్టడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. వరుసగా 2 ఓవర్లలో 4, 7 పరుగులే వచ్చాయి. చివరి ఓవర్లో (నోకియా) 14 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే బ్రూక్‌ వెనుదిరిగాడు. తర్వాతి 5 బంతుల్లో 6 పరుగులే రావడంతో మ్యాచ్‌ సఫారీల సొంతమైంది.

200 ఖాయమనుకుంటే..: మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికాకు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్‌ డికాక్‌ మరోసారి విధ్వంసం సృష్టించడంతో ఆ జట్టు అలవోకగా 200 దాటేస్తుందనిపించించింది. తొలి ఓవర్లో మాత్రమే ఆచితూచి ఆడిన డికాక్‌.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ బౌలర్లు ఎవ్వరినీ లెక్క చేయకుండా దొరికిన బంతిని దొరికినట్లు బాదేయడంతో పవర్‌ప్లేలోనే సఫారీ జట్టు వికెట్‌ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. అందులో డికాక్‌ వాటానే 49. అతను 22 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఆర్చర్‌ వేసిన నాలుగో ఓవర్లో డికాక్‌ 2 సిక్సర్లు, 2 ఫోర్లు బాదేశాడు. మరో ఎండ్‌లో రీజా హెండ్రిక్స్‌ (19) మాత్రం నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాడు. పవర్‌ ప్లే అయ్యాక స్పిన్నర్ల రంగప్రవేశంతో స్కోరు వేగం తగ్గింది. డికాక్‌ కూడా షాట్లు ఆడలేక ఇబ్బంది పడ్డాడు. 9వ ఓవర్లో హెండ్రిక్స్‌ను మొయిన్‌ పెవిలియన్‌ చేర్చగా.. కాసేపటికే డికాక్‌ను ఔట్‌ చేసిన ఆర్చర్‌ ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రమాదకర క్లాసెన్‌ (8)తో పాటు కెప్టెన్‌ మార్‌క్రమ్‌ (1) స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా ఆత్మరక్షణలో పడింది. 15 ఓవర్లకు స్కోరు 115 (4 వికెట్లకు) పరుగులే. అయితే చివరి ఓవర్లలో మిల్లర్‌ చెలరేగి ఆడడంతో దక్షిణాఫ్రికా మెరుగైన స్కోరుతో ఇన్నింగ్స్‌ను ముగించింది.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: రీజా హెండ్రిక్స్‌ (సి) బ్రూక్‌ (బి) మొయిన్‌ 19; డికాక్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 65; క్లాసెన్‌ రనౌట్‌ 8; మిల్లర్‌ (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 43; మార్‌క్రమ్‌ (బి) రషీద్‌ 1; స్టబ్స్‌ నాటౌట్‌ 12; యాన్సెన్‌ (సి) కరన్‌ (బి) ఆర్చర్‌ 0; కేశవ్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 163; వికెట్ల పతనం: 1-86, 2-92, 3-103, 4-113, 5-155, 6-155 బౌలింగ్‌: టాప్లీ 4-0-23-0; మొయిన్‌ అలీ 3-0-25-1; ఆర్చర్‌ 4-0-40-3; సామ్‌ కరన్‌ 3-0-29-0; అడిల్‌ రషీద్‌ 4-0-20-1; వుడ్‌ 2-0-22-0

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) హెండ్రిక్స్‌ (బి) రబాడ 11; బట్లర్‌ (సి) క్లాసెన్‌ (బి) మహరాజ్‌ 17; బెయిర్‌స్టో (సి) నోకియా (బి) మహరాజ్‌ 16; మొయిన్‌ అలీ (సి) మహరాజ్‌ (బి) బార్ట్‌మన్‌ 9; బ్రూక్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) నోకియా 53; లివింగ్‌స్టన్‌ (సి) స్టబ్స్‌ (బి) రబాడ 33; సామ్‌ కరన్‌ నాటౌట్‌ 10; ఆర్చర్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 156; వికెట్ల పతనం: 1-15, 2-43, 3-54, 4-61, 5-139, 6-150 బౌలింగ్‌: యాన్సెన్‌ 4-0-31-0; రబాడ 4-0-32-2; కేశవ్‌ మహరాజ్‌ 4-0-25-2; బార్ట్‌మన్‌ 3-0-27-1; నోకియా 4-0-35-1; మార్‌క్రమ్‌ 1-0-4-0


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని