పడిక్కల్‌ పదనిసలు: వరుసగా 4వ శతకం

కర్ణాటక యువ క్రికెటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ దుమ్మురేపుతున్నాడు. విజయ్‌ హజారే దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంటులో శతకాల మోత మోగిస్తున్నాడు. వీరోచిత ఫామ్‌లో ఉన్న అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. సోమవారం కేరళతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో నాలుగో శతకం అందుకున్నాడు....

Published : 08 Mar 2021 23:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటక యువ క్రికెటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ దుమ్మురేపుతున్నాడు. విజయ్‌ హజారే దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంటులో శతకాల మోత మోగిస్తున్నాడు. వీరోచిత ఫామ్‌లో ఉన్న అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. సోమవారం కేరళతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో నాలుగో శతకం అందుకున్నాడు. టీమ్‌ఇండియాకు ఎంపిక చేయక తప్పదన్నట్టుగా సంచలనాలు సృష్టిస్తున్నాడు.

దేవదత్‌ పడిక్కల్‌ గతేడాది ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడిన సంగతి తెలిసిందే. విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ సహచర్యంలో మంచి అనుభవం సాధించిన అతడు దేశవాళీ క్రికెట్లో రెచ్చిపోతున్నాడు. ఇప్పటి వరకు విజయ్ హజారేలో 6 మ్యాచుల్లో 4 శతకాలు, 2 అర్ధశతకాలు బాదేశాడు. వరుసగా 52 (84 బంతుల్లో), 97 (98), 152 (140), 126* (138), 145* (125), 101 (119) స్కోర్లు చేశాడు. మొత్తంగా 673 పరుగులు సాధించాడు.

తిరుగులేని ఆటతీరు కనబరుస్తున్న దేవదత్‌ను టీమ్‌ఇండియాకు ఎంపిక చేయాలని అభిమానులు కోరుతున్నారు. నెటిజన్లు ట్విటర్లో విపరీతంగా ట్రెండ్‌ చేస్తున్నారు. ‘చూడబోతుంటే శిఖర్‌ ధావన్‌ స్థానంలో టీమ్‌ఇండియాకు దేవదత్‌ పడిక్కల్‌ దొరికినట్టే కనిపిస్తున్నాడు. వరుసగా 4 శతకాలంటే మాటలు కాదు. అతడిది అంతర్జాతీయ స్థాయి’ అని ఓ అభిమాని అన్నారు. ‘భారత క్రికెట్‌కు కర్ణాటక ఎంతోమంది దిగ్గజాలను అందించింది. తర్వాతి స్థానం దేవదత్‌ పడిక్కల్‌దే’ అని మరొకరు పేర్కొన్నారు. కాగా మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌ 2021 సీజన్‌ ఆరంభం కాబోతోంది. 4 వరుస శతకాలు చేసిన పడిక్కల్‌ను చూసి ఆ ఫ్రాంచైజీ మురిసిపోతోంది. అతడికి తిరుగులేదని ట్వీట్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని