MS Dhoni : ఎంఎస్ ధోనీ.. ఓ అద్భుతమైన వ్యూహకర్త: డుప్లెసిస్

చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) తరఫున ఆడిన వారికి ఎంఎస్ ధోనీ (MS Dhoni) సారథ్య బాధ్యతలు గురించి ఎలా ఉంటాయో తెలుసు. ప్రత్యర్థి ఆటను బట్టి వ్యూహాలను సిద్ధం చేయడంలో సిద్ధహస్తుడు. ఇదే విషయాన్ని సీఎస్‌కేలో ఒకప్పటి సహచరుడు డుప్లెసిస్‌ (Faf du Plessis) కూడా ఇదే చెప్పాడు.

Published : 02 Mar 2023 01:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత క్రికెట్‌ చరిత్రలోనే కాకుండా.. అంతర్జాతీయంగా తన కెప్టెన్సీతో ఎంఎస్ ధోనీ (MS Dhoni)భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించాడు. టీమ్‌ఇండియాకి (Team India) వన్డే, టీ20 ప్రపంచకప్‌తో పాటు ఛాంపియన్స్‌ ట్రోఫీని అందించిన ఘన చరిత్ర ధోనీ సొంతం. ఇక ఐపీఎల్‌లోనూ (IPL) చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)సారథిగా నాలుగు టైటిళ్లను అందించాడు. మార్చి 31నుంచి ప్రారంభమయ్యే పదహారో సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ధోనీతో ఆడిన అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాఫ్ డుప్లెసిస్‌ (Faf du Plessis) వ్యాఖ్యానించాడు. ధోనీ సారథ్యంలోని చెన్నైకి 2011-15, 2018 - 2021 సీజన్లలో డుప్లెసిస్‌ ఆడాడు. ధోనీ కెప్టెన్సీ, వ్యూహాలపై పలు వ్యాఖ్యలు చేశాడు. అలాగే, తాను ఆడిన కెప్టెన్ల సారథ్యం వహించలేదని పేర్కొన్నాడు.

‘‘నేను సారథిగా వ్యవహరించిన కాలంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే.. అది నేనాడిన కెప్టెన్ల మార్గంలో వెళ్లకపోవడమే. గ్రేమీ స్మిత్, స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, ఎంఎస్ ధోనీ.. ఇలా ఎవరి మాదిరిగా చేయలేదు. వ్యక్తిగతంగా చూసుకుంటే అదే ఉత్తమమనిపించింది. నీకు నీలా వెళ్లకపోతే.. అభిమానులు  ఇతరులతో పోల్చి చూస్తారు. అప్పుడు ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. నేను చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఉన్నప్పుడు చాలా సమయం మాజీ కెప్టెన్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో గడిపా.  ఎన్నో ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేవాడిని. నేర్చుకోవడానికి నాయకత్వ బాధ్యతలు గురించి అడుగుతూనే ఉండేవాడిని. తర్వాత ధోనీ కెప్టెన్సీ చూశాక అద్భుతమనిపించింది. అతడు మ్యాచ్‌ను చదివే విధానం బాగుంటుంది. దానికి తగ్గట్లుగా వ్యూహాలను సిద్ధం చేసేస్తాడు’’అని డుప్లెసిస్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని