GT vs CSK: మధ్య ఓవర్లలో నెమ్మదించాం.. కనీసం 200 స్కోరు చేయాల్సింది: ధోనీ

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ తొలి మ్యాచ్‌ విజయంతో ఐపీఎల్‌ 16వ (IPL 2023) సీజన్‌లో బోణీ కొట్టింది. చివరి వరకు పోరాడిన చెన్నై మాత్రం తడబాటుకు గురై ఓటమిపాలైంది.

Updated : 01 Apr 2023 11:10 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL 2023) అట్టహాసంగా ప్రారంభమైంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ (GT vs CSK) జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నైపై గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 178/7 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో టైటాన్స్ 19.2  ఓవర్లలో 182/5 స్కోరు చేసి గెలిచింది. ఒకదశలో చెన్నై విజయం సాధించేలా కనిపించినా గుజరాత్ బ్యాటర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ మ్యాచ్‌ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము బ్యాటింగ్‌ చేసినప్పుడు స్కోరు 200+ మార్క్‌ను దాటితే బాగుండేదని పేర్కొన్నాడు. రుతురాజ్‌ గైక్వాడ్ (92) క్రీజ్‌లో ఉన్నప్పుడు చెన్నై స్కోరు బోర్డు వేగంగా పరుగులు తీసింది. స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోవడంతో ఒక్కసారి పరుగుల రాక నెమ్మదించి.. భారీ స్కోరు చేయడంలో సీఎస్‌కే విఫలమైంది. బౌలింగ్‌లోనూ ఇంపాక్ట్‌ ప్లేయర్ తుషార్ దేశ్ పాండే విఫలం కావడం కూడా జట్టు ఓటమికి కారణంగా మారింది.

‘‘మ్యాచ్‌లో తేమ ప్రభావం ఉంటుందని తెలుసు. అయితే, తొలుత బ్యాటింగ్‌లో ఇంకాస్త మెరుగ్గా పరుగులు చేయాల్సింది. మిడిల్‌ ఓవర్లలో మా బ్యాటింగ్‌ ఇబ్బందికి గురైంది. రుతురాజ్ అద్భుతంగా ఆడాడు. షాట్ల ఎంపిక కూడా చాలా చక్కగా ఉంది. ఇలాంటి ఇన్నింగ్స్‌ యువకుల్లో ఆత్మవిశ్వాసం నింపుతుంది. మరో యువ బౌలర్‌ రాజ్‌వర్థన్ హంగార్గేకర్‌ సూపర్‌గా బౌలింగ్‌ చేశాడు. టైమింగ్‌తో కూడిన పేస్‌ను సంధించడం అభినందనీయం. నోబాల్స్‌ అనేవి మన చేతుల్లో ఉంటాయి. వాటిని నియంత్రించడానికి మరికొంత సాధన చేయాలి. బౌలింగ్‌ విభాగం ప్రదర్శనపై సంతృప్తితో ఉన్నా’’ అని ధోనీ తెలిపాడు. 

‘ఇంపాక్ట్‌’ ఎంపిక నాకు కష్టమైంది: హార్దిక్‌

‘‘క్లిష్టపరిస్థితుల్లో మా బ్యాటర్లు అదరగొట్టారు. మరీ ముఖ్యంగా చివర్లో రాహుల్‌, రషీద్‌ భారీ షాట్లను కొట్టారు. మా బౌలింగ్ విభాగం చాలా బాగా రాణించింది. ఒకానొక సమయంలో చెన్నై 200 స్కోరు దాటేలా అనిపించించింది. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీయడం వల్ల మ్యాచ్‌పై పట్టు సాధించగలిగాం. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన నాకు కాస్త కష్టంగా మారింది. మా దగ్గర చాలా ఆప్షన్లు ఉన్నాయి. తొలుత బౌలింగ్‌ విభాగంలో ఒకరు తక్కువగా అనిపించారు. అయితే, హార్డ్‌ లెంగ్త్‌తో బంతులను సంధిస్తే మంచిదని భావించాం. అందుకే అల్జారీని కాస్త ఆలస్యంగా బౌలింగ్‌కు దించాను’’ అని హార్దిక్‌ వివరించాడు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని