Dhoni: ధోనీ కెప్టెన్‌ కాకపోతే చెన్నైకి ఏదీ కలిసిరాదు: సెహ్వాగ్‌

చెన్నై కెప్టెన్‌గా రవీంద్ర జడేజా తప్పుకోవడంతో మహేంద్రసింగ్‌ ధోనీ మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు...

Updated : 01 May 2022 09:56 IST

మహీ తిరిగి బాధ్యతలు చేపట్టడంపై ఎవరేమన్నారంటే?

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై కెప్టెన్‌గా రవీంద్ర జడేజా తప్పుకోవడంతో మహేంద్రసింగ్‌ ధోనీ మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో చెన్నై ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం రెండు మ్యాచ్‌లే గెలిచి ఆరు ఓటములు చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతూ ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలోనే జడేజా అటు సారథిగా, ఇటు బ్యాట్స్‌మన్‌గా విఫలమయ్యాడు. దీంతో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని తిరిగి ధోనీకే అప్పగించాడు. ఈ మేరకు చెన్నై యాజమాన్యంతోపాటు ధోనీ కూడా అంగీకరించారు. దీంతో ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌తో తలపడే మ్యాచ్‌లో మహీ మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలోనే పలువురు క్రికెట్‌ ప్రముఖులు స్పందించారు.

* జడేజాను కెప్టెన్‌గా నియమించిన నాటి నుంచే నేనీ విషయాన్ని చెప్తున్నా. ధోనీ కెప్టెన్‌గా లేకపోతే చెన్నై జట్టుకు ఏదీ కలిసిరాదు. ఆలస్యమైనా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. వాళ్లకింకా అవకాశం ఉంది. చెన్నై ప్లేఆఫ్స్‌కు వెళ్లడానికి కావాల్సినన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ధోనీ పగ్గాలు అందుకున్నాక పరిస్థితి మారుతుంది.-వీరేందర్‌ సెహ్వాగ్‌

* జడేజాను కెప్టెన్‌గా ఎంపిక చేసినప్పుడు.. కాదనడానికి అతడికి వేరే అవకాశం లేదనుకుంటా. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నా ఆ ప్రభావం కూడా ఏమీ ఉండదు. జట్టులో ధోనీ ఉంటే.. అతడే సారథిగా ఉండాలి. టీమ్‌ఇండియా 2019 వన్డే ప్రపంచకప్‌ ఆడేటప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాను. జడ్డూ ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు. కెప్టెన్సీ అతడికి భారంగా ఉంటుంది.   -అజయ్ జడేజా

* ఇది చాలా అరుదైన విషయం. బహుశా జడేజా కెప్టెన్సీని ఆస్వాదించలేకపోయాడేమో. అతడి వ్యక్తిగత ప్రదర్శన కూడా చెన్నై జట్టుకు ఉపయోగపడటంలేదు. అలాంటప్పుడు ధోనీకి తిరిగి జట్టు బాధ్యతలు అప్పగించడమే తేలికైన పని అని భావించి ఉండొచ్చు.  -డేనియల్‌ వెటోరి.

* ఈ విషయంలో నేను జడేజా పట్ల చింతిస్తున్నాను. ఈ నిర్ణయం క్రికెటర్‌గా అతడిపై చెడు ప్రభావం చూపదనే ఆశిస్తున్నా.    -ఇర్ఫాన్‌ పఠాన్‌.

* చెన్నై జట్టులో ఇలా జరగడం ఎవరూ చూడాలనుకోరు.    -ఆర్పీ సింగ్‌

*  ధోనీ తిరిగి చెన్నై కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడం మనకు కల నిజమైనట్లుగా అనిపించవచ్చు.   -వసీమ్‌ జాఫర్

* చెన్నై జట్టు నుంచి ఇది అస్సలు ఊహించలేదు.  -పార్థివ్‌ పటేల్‌

* జడేజా తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసంతో కూడుకున్నది. తన కోసం, తన జట్టు కోసం మంచి నిర్ణయమే తీసుకున్నాడు. దీంతో ఇప్పుడు ధోనీ అభిమానులు సంతోషంగా ఉంటారు. వాళ్లు కూడా ఇదే కోరుకుని ఉంటారు. ఇకపై మనం ధోనీ నుంచి మరింత మంచి ప్రదర్శన చూడొచ్చు.  -గ్రేమ్‌స్వాన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు