సాహా కోసమే ధోనీ రిటైర్మెంట్‌: ఇషాంత్‌

వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్ సాహాకు అవకాశాలు దక్కడం కోసమే టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ టెస్టులకు వీడ్కోలు పలికాడని పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్‌ ఛానెల్‌లో....

Published : 25 Feb 2021 01:43 IST

ఇంటర్నెట్‌డెస్క్: వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్ సాహాకు అవకాశాలు దక్కడం కోసమే టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ టెస్టులకు వీడ్కోలు పలికాడని పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్‌ ఛానల్‌లో ధోనీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. మహీ వ్యక్తిగత రికార్డులను పట్టించుకోడని, జట్టు గురించే ఆలోచిస్తాడని లంబూ తెలిపాడు. 2014 ఆస్ట్రేలియా పర్యటనలో మెల్‌బోర్న్‌ టెస్టు అనంతరం ధోనీ టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సిరీస్‌లోని ఆఖరి టెస్టుకు కోహ్లీ నాయకత్వ బాధ్యతలు అందుకున్నాడు.

‘‘మెల్‌బోర్న్‌ టెస్టులో మోకాలి నొప్పితో విపరీతంగా ఇబ్బందిపడ్డాను. దాదాపు ప్రతి సెషన్‌కు ఇంజెక్షన్లను తీసుకుని బౌలింగ్ చేశా. కానీ ఆ మ్యాచ్‌ తర్వాత ధోనీ రిటైర్‌‌ అవుతున్నాడని ఎవరికీ తెలియదు. ఎందుకంటే అందరం టెస్టు మ్యాచ్‌పైనే నిమగ్నమై ఉన్నాం. నాలుగో రోజు టీ సమయానికి ధోనీ వద్దకు వెళ్లి.. ఇక నేను ఇంజెక్షన్లను తీసుకోలేనని చెప్పా. దానికి మహీ.. సరే, ఫర్వాలేదు, నువ్వు బౌలింగ్ చేయకని అన్నాడు’’ అని ఇషాంత్ తెలిపాడు.

‘‘అయితే రిటైర్మెంట్ అనంతరం.. ‘లంబూ నా ఆఖరి టెస్టులో నన్ను ఒంటరిగా విడిచిపెట్టావ్‌ కదా’ అని ధోనీ అన్నాడు. అదే ఆఖరి మ్యాచ్‌ అని తెలిస్తే కచ్చితంగా బౌలింగ్ చేసేవాడినని దానికి బదులిచ్చా. అది భావోద్వేగ సంఘటన. నిజంగా ఆ టెస్టు ఆఖరి రోజు వరకు అతడు టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నాడని తెలియదు’’ అని ఇషాంత్ తెలిపాడు.

‘‘ధోనీ దాదాపు 100 టెస్టులకు దగ్గరగా ఆడాడు. అతడు వ్యక్తిగత రికార్డులను పట్టించుకోడు. జట్టు మంచి కోసమే ఆలోచిస్తాడు. అయితే ఇంగ్లాండ్‌ పర్యటనలో మహీతో మాట్లాడిన ఓ సందర్భం నాకు గుర్తుంది. ‘100 టెస్టుల మైలురాయిని అందుకోవడం నాకు పెద్ద విషయమేమి కాదు. వచ్చే సిరీస్‌ భారత్‌లోనే ఉంది’ అని నాతో ధోనీ అన్నాడు. అతడు సాహా ఎదుగదల గురించి ఆలోచించి రిటైర్మెంట్ ఇచ్చాడని భావిస్తున్నా. ఆ తర్వాత స్వదేశంలో సుదీర్ఘ సిరీస్ ఉంది. అందుకే అతడు వీడ్కోలు పలికి ఉంటాడు’’ అని లంబూ పేర్కొన్నాడు. టీమిండియా తరఫున ధోనీ 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. 2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై పలికాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని