Harbhajan Singh - Dhoni: ధోనీ నా ఆస్తులేం తీసుకోలేదు..: హర్భజన్‌

Harbhajan Singh On Rift Rumours with Dhoni: ధోనీతో తనకున్న అనుబంధాన్ని మరోసారి బయటపెట్టాడు మాజీ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌. మాజీ సారథితో గొడవలున్నట్లు వచ్చిన వదంతులను భజ్జీ ఖండించాడు.

Updated : 20 Mar 2023 13:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ (MS Dhoni)తో మాజీ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh)కు విభేదాలున్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై భజ్జీ తాజాగా స్పందించాడు. ‘ధోనీతో గొడవలు ఉండటానికి ఆయన నా ఆస్తులేం తీసుకోలేదు కదా’ అంటూ వదంతులకు (Rift Rumours) చెక్‌ పెట్టాడు. అసలు వీరి మధ్య విభేదాలున్నట్లు వార్తలు ఎలా వచ్చాయి..? భజ్జీ ఏం చెప్పాడు..? అసలేం జరిగిందంటే..

2021 డిసెంబరులో తన క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు హర్భజన్‌ సింగ్ (Harbhajan Singh). జాతీయ జట్టు నుంచి తనను తొలగించడంపై రిటైర్మెంట్‌ తర్వాత ఎన్నడూ మాట్లాడని భజ్జీ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ విషయం గురించి పరోక్షంగా ప్రస్తావించాడు. ‘‘జట్టు యాజమాన్యం నుంచి ధోనీ (Dhoni) వంటి ఆటగాళ్లకు దొరికినట్లుగా మద్దతు లభిస్తే మాజీ క్రికెటర్లలో చాలా మంది మరికొన్నేళ్లు ఆడేవారు’’ అని వ్యాఖ్యానించాడు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ మాటలతో ధోనీ, టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై భజ్జీ తన అక్కసు వెళ్లగక్కాడని చాలా మంది  ఆపాదించారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు (Rift Rumours) వచ్చినట్లు వార్తలు బయటికొచ్చాయి.

అయితే ఈ వదంతులపై భజ్జీ తాజాగా మరో ఇంటర్వ్యూలో స్పందించాడు. ‘‘ధోనీ (Dhoni)తో నాకేం సమస్య ఉంటుంది. మేమిద్దరం ఎన్నో ఏళ్ల పాటు కలిసి ఆడాం. మేం చాలా మంచి స్నేహితులం. ఇప్పుడు మేమిద్దం మా వ్యక్తిగత జీవితాల్లో బిజీగా ఉన్నాం. అందుకే తరచుగా కలుసుకోలేకపోతున్నాం. అంతేగానీ, మా మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు’’ అని స్పష్టతనిచ్చాడు. ‘‘గొడవలు జరగడానికి ధోనీ నా ఆస్తులేం తీసుకోలేదు (నవ్వుతూ) కానీ, ఆయన ఆస్తులపై నేను చాలా ఆసక్తిగా ఉన్నా. ముఖ్యంగా ఆయన ఫామ్‌హౌస్‌ అంటే నాకు చాలా ఇష్టం’’ అంటూ భజ్జీ సరదాగా వ్యాఖ్యానించాడు.

2021 డిసెంబరులో హర్భజన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.  2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ జట్లలో అతడు సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. ధోనీ సారథ్యంలో భజ్జీ 31 టెస్టులు, 77 వన్డేలు, 25 టీ20 మ్యాచులు ఆడాడు. ఐపీఎల్‌లో ధోనీ సారథ్యం వహించిన చెన్నై జట్టులో హర్భజన్‌ కొన్నేళ్ల పాటు సభ్యుడిగా ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని