ఏం చేస్తాడు! ధోనీకి తప్పడం లేదు మరి

ఎప్పుడూ లేని విధంగా ఎంఎస్‌ ధోనీ ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగుతున్నాడని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అన్నాడు. టాప్‌ఆర్డర్‌ ఇబ్బందుల అతడికి మరో దారి లేదని పేర్కొన్నాడు. అంబటి రాయుడు, సురేశ్‌ రైనా లేకపోవడం వల్ల ధోనీకి మిడిలార్డర్‌ సమస్యలు ఎదురవుతున్నాయని...

Published : 26 Sep 2020 20:08 IST

గత్యంతరం లేకే ఐదుగురు బౌలర్లతో బరిలోకి..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎప్పుడూ లేని విధంగా ఎంఎస్‌ ధోనీ ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగుతున్నాడని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అన్నాడు. టాప్‌ఆర్డర్‌ ఇబ్బందులతో అతడికి మరో దారి లేదని పేర్కొన్నాడు. అంబటి రాయుడు, సురేశ్‌ రైనా లేకపోవడం వల్ల ధోనీకి మిడిలార్డర్‌ సమస్యలు ఎదురవుతున్నాయని వెల్లడించాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌ ‘ఆకాశ్‌వాణి’లో చోప్రా మాట్లాడాడు.

యూఏఈలో జరుగుతున్న లీగులో చెన్నై తొలివారమే మూడు మ్యాచులు ఆడింది. రెండింట్లో ఓడింది. గాయం కారణంగా అంబటి రాయుడు జట్టుకు దూరమయ్యాడు. ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో సైతం ఇంకా గాయం నుంచి  కోలుకున్నట్టు కనిపించలేదు. జట్టు కూర్పు కుదరకపోవడంతో మహీ ఐదుగురు బౌలర్లనే ఆడిస్తున్నాడు.

‘ఐదుగురు బౌలర్లతో ధోనీ ఆడటం నాకు గుర్తున్నంత వరకు ఇదే తొలిసారి. ఐదుగురితో ఆడటం అతనికెప్పుడూ ఇష్టముండదు. కానీ ఈ సారి తప్పడం లేదు. తన బ్యాటింగ్‌ పైనా ఆందోళన చెందుతున్నాడు. తనపై తనకు 100 శాతం ఆత్మవిశ్వాసం లేదు. రాయుడు లేడు. రుతురాజ్‌ రావడం, విజయ్‌ పరుగులు చేయకపోవడంతో ఆరుగురు బౌలర్లను ఆడించలేకపోతున్నాడు. రవీంద్ర జడేజా ఈ సీజన్‌లో అంతగా రాణించడం లేదు. ఆడిన ప్రతిసారీ 40 పరుగులు ఇచ్చాడు. ఎకానమీ 10.50గా ఉంది. చెన్నై బౌలర్లలో అతడిదే ఘోరమైన సగటు. ఐదుగురే బౌలర్లు ఉండటంతో ధోనీకి అతడితో వేయించక తప్పడం లేదు’ అని చోప్రా అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని