MS Dhoni: ‘ధోనీ రివ్యూ సిస్టమ్‌’ దెబ్బకు సూర్యకుమార్‌ ఔట్‌.. వీడియో వైరల్‌

ఐపీఎల్ (IPL 2023) 16వ సీజన్‌లో ముంబయిపై చెన్నై అద్భుత విజయం సాధించింది. అజింక్య రహానె సూపర్ బ్యాటింగ్‌కు తోడుగా కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలివైన నిర్ణయాలు కూడా సీఎస్‌కే విజయానికి దోహదపడ్డాయి.

Published : 09 Apr 2023 13:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఎంఎస్ ధోనీ (MS Dhoni).. కెప్టెన్ కూల్‌గా మనందరికి సుపరిచితుడు. మైదానంలో నిర్ణయాలు చురుగ్గా తీసుకుంటూ తనదైన శైలిలో జట్టును నడిపిస్తాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో (IPL) చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథిగా ఉన్న ధోనీ తనలోని ఓ ప్రత్యేకతను మరోసారి బయటపెట్టేశాడు. ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. ఇంతకీ అదేంటని బుర్రలు బద్దలు కొట్టుకోకండే..! తెలియాలంటే ఇది చదివేయండి.. వీడియోను కూడా చూసేయండి..

టాస్‌ నెగ్గిన చెన్నై కెప్టెన్‌ ధోనీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో ముంబయి తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు రోహిత్ (21), ఇషాన్‌ కిషన్ (32) ఫర్వాలేదనిపించారు. ఓపెనర్లు ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్ (1) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగుకే ఔటై పెవిలియన్‌కు చేరాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతికి అనూహ్యంగా డీఆర్‌ఎస్ ద్వారా ఔట్‌ కావడం గమనార్హం. డీఆర్‌ఎస్.. డెసిషన్ రివ్యూ సిస్టమ్‌ కాదు.. ‘ధోనీ రివ్యూ సిస్టమ్‌’ అనేలా అర్థం మార్చేసిన ధోనీ తన విలక్షణతను బయటపెట్టాడు. సీఎస్‌కే బౌలర్ మిచెల్‌ సాంట్నర్ లెగ్‌సైడ్‌ వేసిన బంతిని స్వీప్‌ చేయబోయిన సూర్య బ్యాట్‌కు తగలలేదని అంపైర్‌ వైడ్‌గా ప్రకటించాడు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయని ధోనీ క్యాచ్‌ ఔట్‌ కోసం డీఆర్‌ఎస్‌ (DRS) సిగ్నల్‌ ఇచ్చేశాడు. సమీక్షలో బంతి సూర్యకుమార్‌ బ్యాట్‌ను తాకినట్లు తేలింది. దీంతో చెన్నై ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా.. పాపం సూర్యకుమార్‌ (Surya Kumar Yadav) మాత్రం నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ధోనీ అప్పీలు చేశాడంటే దాదాపు కరెక్టే ఉంటుందనేది మరోసారి నిరూపితమైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని