Dhoni : ధోని భాయ్‌.. నేను బ్యాటింగ్‌కి న్యాయం చేయట్లేదన్నాడు.! : దీపక్‌ చాహర్‌

‘బంతితో మెరుగ్గా రాణిస్తున్నావు కానీ, బ్యాటింగ్‌కి న్యాయం చేయలేకపోతున్నావు. బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి పెడితే.. అద్బుతాలు చేయగలవు’ అని టీమిండియా మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్..

Published : 22 Feb 2022 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ‘బంతితో మెరుగ్గా రాణిస్తున్నావు కానీ, బ్యాటింగ్‌కి న్యాయం చేయలేకపోతున్నావు. బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి పెడితే.. అద్బుతాలు చేయగలవు’ అని టీమిండియా మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఇచ్చిన సలహాతోనే తాను తిరిగి బ్యాటింగ్‌పై దృష్టి పెట్టినట్లు ఆల్‌ రౌండర్‌ దీపక్‌ చాహర్‌ పేర్కొన్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అతడు ఈ విషయాన్ని బయటపెట్టాడు. 

‘నా చిన్నప్పటి నుంచి నేను బ్యాటింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత కొద్ది రోజులకు బౌలింగ్‌ కూడా అలవాటు చేసుకుని ఆల్‌ రౌండర్‌గా మారాను. 2017-18 సీజన్‌లో నేను పుణె సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఆడిన సమయంలో.. బంతి కంటే బ్యాటుతోనే మెరుగైన ప్రదర్శన చేశా. ఆ తర్వాత నాకు బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా రాలేదు. దాంతో ప్రాక్టీస్‌ కూడా తగ్గిపోయింది. ఫస్టు క్లాస్‌ క్రికెట్లో ప్రధాన ఆటగాళ్లే ఎక్కువగా సమయం బ్యాటింగ్‌ చేసే వాళ్లు. నాకు చాలా అరుదుగా అవకాశాలు వచ్చేవి. దీంతో నా బ్యాటింగ్‌లో నిలకడ లోపించింది. అందుకే, గతేడాది జరిగిన శ్రీలంక పర్యటనలో అర్ధ శతకం చేసేందుకు కూడా చాలా కష్టపడ్డాను. నేను ఎదుర్కొన్న మొదటి 25-30 బంతుల వరకు షాట్లే ఆడలేదు. ఎందుకంటే, నా బ్యాటింగ్‌పై నాకే కాన్ఫిడెన్స్‌ లేదు. ఆ సిరీస్‌ కంటే ఐదారు నెలల ముందు వరకు నేనసలు బ్యాటింగ్ చేయలేదు. ఆ తర్వాత ధోని భాయ్‌ సూచనతో రెగ్యులర్‌గా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి.. మునుపటి లయను అందుకున్నాను. అలాగే బౌలింగ్‌కి కూడా తగినంత సమయం కేటాయించా. అయితే, బౌలింగ్‌కి లిమిట్ ఉంటుంది. రోజుకు ఇన్ని బంతులు ప్రాక్టీస్ చేయాలనే పరిమితి ఉంటుంది. అంతకు మించి వేస్తే.. అది శరీరంపై ప్రభావం చూపిస్తుంది. బ్యాటింగ్ అలా కాదు.. ఎంతసేపైనా సాధన చేయవచ్చు’ అని దీపక్‌ చాహర్‌ పేర్కొన్నాడు.

ఇటీవల ముగిసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) మెగా వేలంలో దీపక్‌ చాహర్‌ని చెన్నై సూపర్‌ కింగ్స్ (సీఎస్కే) జట్టు రూ. 14 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. సీఎస్కే జట్టుకు మహేంద్ర సింగ్ ధోని సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని