Tokyo Olympics: ఒలింపిక్‌ డిప్లొమా గురించి తెలుసా?

ప్రపంచక్రీడ ఒలింపిక్స్‌లో అనేక విభాగాల్లో పోటీలు నిర్వహిస్తుంటారు. వాటిలో తొలిస్థానం దక్కించుకున్నవారికి స్వర్ణ పతకం, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వారికి రజత, కాంస్య పతకాలు అందజేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత స్థానాల్లో నిలిచిన వారి సంగతేంటి? ఏముంది ఓడిపోయి

Published : 10 Aug 2021 13:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచక్రీడ ఒలింపిక్స్‌లో భాగంగా అనేక విభాగాల్లో పోటీలు నిర్వహిస్తుంటారు. వాటిలో తొలిస్థానం దక్కించుకున్నవారికి స్వర్ణ పతకం, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వారికి రజత, కాంస్య పతకాలు అందజేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత స్థానాల్లో నిలిచిన వారి సంగతేంటి? ఏముంది ఓడిపోయి స్వదేశానికి వెనుదిరుగుతారు అంతేగా అనుకుంటున్నారా? కాదండీ.. క్రీడల ఫలితాల జాబితాలో టాప్‌ 8 అథ్లెట్లకు ‘ఒలింపిక్‌ డిప్లొమా’ దక్కుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. 

ఏంటీ ఒలింపిక్‌ డిప్లొమా?

దేశానికి పతకం సాధించిపెట్టాలన్న లక్ష్యంతోనే అథ్లెట్లు కఠోర శిక్షణతో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతారు. నాలుగేళ్లు శ్రమించి.. బరిలోకి దిగుతారు. గెలవాలనే పట్టుదలతోనే పోటీ పడతారు. కానీ, అందరూ పతకాలు గెలవలేరు కదా! అత్యుత్తమ ప్రదర్శనతో ఒకరు మాత్రమే స్వర్ణం గెలవగలరు. ఆ తర్వాత రెండు స్థానాల్లో ఉన్నవారు కూడా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకుంటారు. అయితే, అంత కష్టపడి పోటీలో పాల్గొని తృటిలో పతకం కోల్పోయిన వారిని అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ(ఐవోసీ) ఉట్టి చేతులతో పంపించాలని అనుకోలేదు. అందుకే, జాబితాలో టాప్‌లో ఉన్న ఎనిమిది మందికి ఒలింపిక్‌ డిప్లొమా సర్టిఫికెట్‌ ఇస్తోంది. అందులో క్రీడావిభాగం.. అథ్లెట్‌ పేరు.. నిలిచిన స్థానం రాసుంటుంది. దానిపై ఐవోసీ అధ్యక్షుడు, ఒలింపిక్స్‌ నిర్వహణ కమిటీ అధ్యక్షుల సంతకాలు ఉంటాయి.

ఎప్పటి నుంచి మొదలుపెట్టారు?

1896లో నిర్వహించిన తొలి మోడ్రన్‌ ఒలింపిక్స్‌ నుంచే ఈ ఒలింపిక్‌ డిప్లొమా ప్రదానం జరుగుతోంది. అయితే, ఆ ఒలింపిక్స్‌లో కేవలం స్వర్ణ పతకం గెలిచిన వ్యక్తికే డిప్లొమా ఇచ్చారు. ఆ సమయంలో కేవలం స్వర్ణ, రజత పతకాలే ఉండేవి. రెండో ఒలింపిక్స్‌-1900లో స్వర్ణం, రజతంతోపాటు కాంస్య పతకాన్ని ప్రవేశపెట్టారు. అయితే,  1924 నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి పతకాలతోపాటు డిప్లొమా ఇస్తూ వచ్చారు. 1948 నుంచి జాబితాలో టాప్‌ 6 అథ్లెట్లకు, 1980 తర్వాత నుంచి టాప్‌ 8 అథ్లెట్లకు ఈ ఒలింపిక్‌ డిప్లొమాను ఇస్తున్నారు. ఈ సర్టిఫికేట్‌ అథ్లెట్లకు ప్రోత్సాహకరంగా ఉంటుందని ఐవోసీ ఉద్దేశం. అయితే, ఇలా డిప్లొమా పొందిన అథ్లెట్లు ఐవోసీ నిబంధనలు ఉల్లంఘించినా.. డోపింగ్‌ పరీక్షల్లో దొరికినా ఈ డిప్లొమా సర్టిఫికెట్‌ను ఐవోసీకి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని