Olympics: ప్రాచీన.. ఆధునిక ఒలింపిక్స్‌కు ఉన్న తేడాలివే!

ఒలింపిక్స్‌.. ప్రపంచ క్రీడారంగంలో అత్యంత సూదీర్ఘ చరిత్రగల మెగాటోర్నీ. ఇక్కడ పతకం గెలిస్తే దేశపు ప్రతిష్ట మరింత పెరుగుతుందన్న భావన. అందుకే దాదాపు అన్ని దేశాలు ఈ ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొంటాయి. కానీ, ప్రాచీన ఒలింపిక్స్‌ అలా కాదు. అప్పుడు ఈ ఒలింపిక్స్‌ ఒక స్థానిక క్రీడలన్న సంగతి తెలుసా? ఇదే కాదు, ప్రస్తుత

Updated : 30 Jul 2021 12:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒలింపిక్స్‌.. ప్రపంచ క్రీడారంగంలో అత్యంత సుదీర్ఘ చరిత్రగల మెగా టోర్నీ. ఇక్కడ పతకం గెలిస్తే దేశపు ప్రతిష్ట మరింత పెరుగుతుంది. అందుకే దాదాపు అన్ని దేశాలూ ఈ ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొంటాయి. కానీ, ప్రాచీన ఒలింపిక్స్‌ అలా కాదు. అప్పుడు ఈ ఒలింపిక్స్‌ ఒక స్థానిక క్రీడలన్న సంగతి తెలుసా? ఇదే కాదు, ప్రస్తుత ఒలింపిక్స్‌కు.. ఒకప్పటి గ్రీక్‌ ఒలింపిక్స్‌కు చాలా తేడాలున్నాయ్‌ అవేంటో చూద్దాం..!

* ప్రాచీన ఒలింపిక్స్‌లో ఒకప్పటి గ్రీక్‌ రాజ్యంలోని దేశాలు మాత్రమే భాగస్వామ్యయ్యేవి. ఇప్పుడు 200కుపైగా దేశాలు పాల్గొంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో 205 దేశాల నుంచి 11వేలకుపైగా అథ్లెట్లు వివిధ విభాగాల్లో పోటీపడుతున్నారు.

* అప్పటి ఒలింపిక్స్‌లో గ్రీక్‌రాజ్యంలోని పౌరులు మాత్రమే నగ్నంగా క్రీడల్లో పాల్గొనేవారు. మహిళలు పోటీలో పాల్గొనేందుకు అనర్హులు. కాకపోతే వారికి వేరుగా కొన్ని క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించేవారు. ఒలింపిక్స్‌లో పాల్గొనేలా గ్రీక్‌ రాజ్యంలో ప్రతి పౌరుడి విద్యాభ్యాసంలో అథ్లెటిక్‌ శిక్షణ ఉండేది. ఆధునిక ఒలింపిక్స్‌లో అన్ని దేశాలు పాల్గొనవచ్చు. పురుషులు, మహిళల కోసం వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నారు. కొన్ని క్రీడలు మిక్స్‌డ్‌ డబుల్‌ పేరుతో పురుషులు, మహిళలు కలిసి ఆడుతున్నారు. క్రీడల్లో పాల్గొనేందుకు అథ్లెట్లు వ్యక్తిగతంగా లేదా ప్రభుత్వ స్పోర్ట్స్‌ అకాడమీలో చేరి శిక్షణ పొందుతుంటారు.

* గ్రీక్‌ ఒలింపిక్స్‌ను మతపరమైన క్రీడోత్సవంగా నిర్వహించేవారు. గ్రీక్‌ దేవుడు జూస్‌ కోసం ఆడేవారు. కానీ, 1896లో ప్రారంభమైన ఆధునిక ఒలింపిక్స్‌ను ఒక అంతర్జాతీయ టోర్నీగా మార్చారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్న అథ్లెట్‌ అయినా ఈ పోటీల్లో పాల్గొని సత్తా చాటే అవకాశం కల్పించారు. ఇందులో గెలిస్తే వ్యక్తిగతంగా పేరు రావడమే కాదు.. దేశం కూడా గర్విస్తుంది.

* ప్రాచీన ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవాల్లో వంద ఎద్దుల్ని బలి ఇచ్చేవారట. జ్యోతిని వెలిగించి.. పోటీలు పూర్తయ్యేవరకూ ఆరిపోకుండా చూసేవారు. ఇప్పటి ఒలింపిక్స్‌లో బలిదానాలు ఏమీ ఉండవు. కానీ.. కనులపండుగా ప్రారంభోత్సవ వేడుక జరుగుతుంది. క్రీడాభిమానుల సమక్షంలో సంగీత కచేరీలు.. కళకారుల ప్రదర్శనలు.. ఆటపాటలు.. బాణాసంచా వెలుగులు ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సారి టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో మాత్రం కరోనా నిబంధనల దృష్ట్యా క్రీడాభిమానులకు అనుమతి ఇవ్వలేదు. కొద్ది మంది అతిథులు మాత్రమే వేడుకకు హాజరయ్యారు.

* గ్రీక్‌ ఒలింపిక్స్‌ ఎప్పుడూ ఒలింపియా వేదికగానే జరిగేవి. మరో వేదిక ఉండేది కాదు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఆధునిక ఒలింపిక్స్‌కు ఒక్కోసారి ఒక్కో దేశం ఆతిథ్యమిస్తుంటుంది. తొలి ఒలింపిక్స్‌ను గ్రీస్‌లోని ఏథేన్స్‌లో నిర్వహించారు. ఆ తర్వాత ఫ్రాన్స్‌, అమెరికా, యూకే ఇలా అనేక దేశాల్లో ఈ మెగాటోర్నీ జరుగుతూ వస్తోంది. తాజాగా జపాన్‌లోని టోక్యోలో క్రీడలను నిర్వహిస్తున్నారు.

* ప్రాచీన ఒలింపిక్స్‌ క్రీడల్లో కేవలం ఒక్క విజేత మాత్రమే ఉండేవారు. పోటీలో గెలుపొంది అగ్రస్థానానికి వచ్చిన అథ్లెట్‌ను విజేతగా ప్రకటించి.. అతడికి ఆలివ్‌ ఆకులతో చేసిన కిరీటాన్ని ధరింపజేసేవారు. ఆ కాలంలో ఆలివ్‌ ఆకులను చాలా విశిష్ఠమైనవిగా భావించేవారు. అందుకే వాటితో సత్కరించేవారు. అలాగే, భూమిని కూడా రాసిచ్చేవారట. ఆ తర్వాత విజేత విగ్రహాన్ని ఒలింపియా స్టేడియంలో ఏర్పాటు చేసేవారు.

* గ్రీక్‌ ఒలింపిక్స్‌ నిర్వాహకులు ఎప్పుడూ వింటర్‌ ఒలింపిక్స్‌ నిర్వహించలేదు. వారికి ఆ ఆలోచన కూడా రాలేదు. కానీ, ఆధునిక ఒలింపిక్స్‌లో వింటర్‌ ఒలింపిక్స్‌ను ప్రారంభించారు. మంచులో.. మంచుతో ఆడే ఈ క్రీడలను తొలిసారి ఫ్రాన్స్‌లో 1924లో ప్రారంభించారు. ఈ పోటీల్లో 17 దేశాల నుంచి 258 అథ్లెట్లు పాల్గొన్నారు. వింటర్‌తోపాటు పారా ఒలింపిక్స్‌, యూత్‌ ఒలింపిక్స్‌ క్రీడలను సైతం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ నిర్వహిస్తోంది. తొలి యూత్‌ ఒలింపిక్స్‌ 2010 ఆగస్టులో సింగపూర్‌ వేదికగా జరిగింది.

* ప్రాచీన ఒలింపిక్స్‌లో గుర్రపు బండ్ల పరుగు, రన్నింగ్‌, రెజ్లింగ్‌, డిస్కస్‌ త్రో, షాట్‌పుట్‌, ఆర్చరీ, లాంగ్‌ జంప్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, జెవలీన్‌, జిమ్నాస్టిక్స్‌ వంటి క్రీడలు ఉండేవి. ఆధునిక ఒలింపిక్స్‌లో గుర్రపు బండ్ల పరుగు మినహా మిగతా వీటితోపాటు బైసైక్లింగ్‌, మారథాన్స్‌, స్విమ్మింగ్‌, డైవింగ్‌, సెయిలింగ్‌, షూటింగ్‌, టెన్నీస్‌ ఇలా అనేక అనేక క్రీడలను ప్రవేశపెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు