Gill-Ishan: కేఎల్‌ రాహుల్‌ వస్తే ఆ ఇద్దరూ ఒకే జట్టులో ఉండడం కష్టమే: మంజ్రేకర్‌

తన వివాహం కారణంగా కేఎల్‌ రాహుల్‌ భారత్‌-న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌కి దూరమైన విషయం తెలిసిందే. అతడు అందుబాటులోకి వస్తే శుభ్‌మన్‌గిల్‌, ఇషాన్‌ కిషన్‌ ఇద్దర్నీ జట్టులో కొనసాగించడం కష్టమని మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు.

Updated : 22 Jan 2023 09:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేఎల్‌ రాహుల్‌ తిరిగి వస్తే ఇషాన్‌ కిషన్, శుభ్‌మన్‌ గిల్‌ ఇద్దర్నీ జట్టులో కొనసాగించడం కష్టమని భారత మాజీ బ్యాటర్ సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. రాహుల్‌ వస్తే ఇషాన్‌ జట్టు నుంచి తప్పుకోవలసి ఉంటుందన్నాడు. ఇషాన్‌ మిడిలార్డర్‌లో స్థిరపడలేదని, అందువల్ల రాహుల్‌ స్థానంలో ఇషాన్‌ను తొలగించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

ఇషాన్‌కిషన్‌, శుభ్‌మన్‌గిల్‌ ఇద్దరూ ఇటీవలే వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదారు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో ఇషాన్‌ 126 బంతుల్లో అత్యంత వేగంగా 210 పరుగులు చేసి ద్విశతకం సాధించాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో శుభ్‌మన్‌గిల్‌ 149 బంతుల్లో 208 పరుగులతో డబుల్ సెంచరీ బాదాడు. కేఎల్ రాహుల్ తన వివాహం కారణంగా న్యూజిలాండ్‌తో సిరీస్‌కి దూరమయ్యాడు. వరుసగా వన్డే, టీ20 సిరీస్‌లు జరగనున్న నేపథ్యంలో రాహుల్‌ తిరిగొచ్చాక జట్టులో ఇషాన్‌, శుభ్‌మన్‌ స్థానం ఏంటి అనేది ప్రశ్నగా మారింది. ఇషాన్‌కిషన్‌, కేఎల్ రాహుల్‌ ఇద్దరూ వికెట్‌కీపర్లే. అందువల్ల రాహల్‌ వస్తే ఇషాన్‌ తప్పుకోక తప్పదని మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు.

‘‘కేఎల్ రాహుల్‌ అందుబాటులోకి వచ్చాక ఇషాన్‌కిషన్, శుభ్‌మన్‌ గిల్‌.. ఇద్దర్నీ జట్టులో కొనసాగించడం కష్టం అవుతుంది. ఇషాన్‌ కూడా వికెట్‌ కీపర్‌. అతడు ఐదో స్థానంలో ఆడాల్సి ఉంటుంది. కానీ మిడిలార్డర్‌లో అతడు ఇంకా స్థిరపడలేదు. ప్రదర్శన పరంగా రాహుల్‌ అతడి కంటే ముందున్నాడు. అందువల్ల రాహుల్‌ తిరిగి వస్తే ఇషాన్‌ తప్పుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మ్యాచ్‌లు జరుగుతున్నందున అప్పుడప్పుడు అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి యువ ఆటగాళ్లు అవకాశం వచ్చినప్పుడే ప్రతిభ చూపించి కొన్ని మ్యచ్‌లకు దూరమవ్వడం ఉత్తమం. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌కు చాలామంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు ’’ అని మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని