Mike Hussey: భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ కష్టం!

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ ఆడటం కష్టమేనని చెన్నె సూపర్‌కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ మైక్ హస్సీ అన్నాడు.........

Published : 20 May 2021 12:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ ఆడటం కష్టమేనని చెన్నె సూపర్‌కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ మైక్ హస్సీ అన్నాడు. ఐపీఎల్‌ కన్నా ఎక్కువ జట్లు మెగా టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపాడు. అలాంటప్పుడు ఎక్కువ వేదికలు అవసరమవుతాయని పేర్కొన్నాడు.

ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ కోసం మైక్‌ హస్సీ భారత్‌కు వచ్చాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌కు బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. చెన్నై జట్టు ముంబయిలో అద్భుత విజయాలు సాధించింది. అయితే వేదిక మారిన తర్వాత లీగ్‌లో కరోనా వైరస్‌ కలకలం చెలరేగింది. ఈ క్రమంలో బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ, హస్సీకి కొవిడ్ పాజిటివ్‌ వచ్చింది. ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడ్డా, హస్సీ ఇక్కడే క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందాడు. ఈ మధ్యే ఆస్ట్రేలియా వెళ్లాడు.

‘భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ ఆడటం అత్యంత కష్టమని నా అభిప్రాయం. ఐపీఎల్‌లో ఎనిమిది జట్లే ఉంటాయి. టీ20 ప్రపంచకప్‌ ఇందుకు భిన్నమేమీ కాదు. అంతకన్నా ఎక్కువ జట్లే వస్తాయి. కాబట్టి ఎక్కువ వేదికలు ఉంటాయి. ముందే చెప్పినట్టు ఒకవేళ వేర్వేరు నగరాల్లో మ్యాచ్లు‌ ఆడితే.. ప్రమాదం ఎక్కువగా ఉంటుంది’ అని హస్సీ అన్నాడు.

‘ఏదేమైనా బీసీసీఐ భారీ ప్రత్యామ్నాయ ప్రణాళికలతో ముందుకు రావాలి. యూఏఈ లేదా ఇంకేదైనా దేశంలో టీ20 ప్రపంచకప్‌ నిర్వహించేందుకు చూడాలి. ఎందుకంటే ప్రపంచంలోని చాలా బోర్డులు భారత్‌కు వెళ్లి టోర్నీ ఆడేందుకు ఆందోళన పడుతున్నాయని  అనిపిస్తోంది’ అని హస్సీ వివరించాడు. ఐపీఎల్‌ వాయిదా పడటంతో బీసీసీఐ ఆచితూచి అడుగులు వేస్తోంది. టీ20  ప్రపంచకప్‌ నిర్వహణ గురించి బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని