ముంబయిపై హార్దిక్‌ కామెంట్స్‌కు రోహిత్‌ కౌంటర్‌.. హీటెక్కిన సమరం..!

గుజరాత్‌-ముంబయి పోరుకు ముందే వాతావరణం హీటెక్కింది. గతంలో హార్దిక్‌ ముంబయి జట్టుపై చేసిన కామెంట్స్‌కు తాజాగా రోహిత్‌ కౌంటర్‌ ఇచ్చాడు. హిట్‌మ్యాన్‌కు మద్దతుగా ఇర్ఫాన్‌ కూడా ట్వీట్‌ చేయడం మరింత వేడిని పెంచింది.  

Updated : 26 May 2023 14:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గుజరాత్‌ టైటాన్స్‌(GT) - ముంబయి ఇండియన్స్‌(MI) మధ్య ఐపీఎల్‌-16 (IPL-16) క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌కు ముందే మాటల యుద్ధానికి తెరలేచింది. ముంబయి జట్టుపై గతంలో గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(Hardik pandya) చేసిన కామెంట్లు.. ఈ మ్యాచ్‌ను ఇప్పుడు ఉత్కంఠగా మార్చేశాయి. ఈ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకొన్న ముంబయి కెప్టెన్‌ రోహిత్‌(Rohit sharma) ఇటీవల హార్దిక్‌కు జవాబిచ్చాడు. దీనికి తోడు ఎంఐ మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌(Irfan pathan) కూడా రోహిత్‌కు మద్దతుగా నిలిచాడు. ఈ వ్యాఖ్యలు నేటి మ్యాచ్‌కు ముందే హీట్‌ను పెంచేశాయి. రోహిత్‌ వ్యాఖ్యలు సూటిగా పాండ్యాను లక్ష్యంగా చేసుకునేలా ఉన్నాయి. ఫలితంగా మ్యాచ్‌ హార్దిక్‌ వర్సెస్‌ రోహిత్‌ లేదా హార్దిక్‌ వర్సెస్‌ ముంబయి ఇండియన్స్‌గా మారిపోయింది.

అసలేం జరిగింది..

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో హార్దిక్‌ పాండ్యా జట్ల తీరుపై వ్యాఖ్యలు చేశారు. ‘‘విజయాన్ని సాధించడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి.. పలు చోట్ల నుంచి మంచి ఆటగాళ్లను జట్టులో చేర్చుకొని విజయం సాధించడం. ముంబయి ఇలానే చేస్తుందనుకుంటాను. గతంలో మేము విజయం సాధించిన సమయాల్లో ఇలానే చేశాం. రెండోది.. మనం విజయం సాధించడానికి అవసరమైన మంచి వాతావరణం సృష్టించడం. ఇది చెన్నై సూపర్‌కింగ్స్‌ విధానం. ఆ ఆటగాళ్లు ఏవరైనా సరే.. వారికి సౌకర్యవంతమైన పరిస్థితులు కల్పించి.. వారి నుంచి అత్యుత్తమ ఫలితాన్ని రాబడుతుంది. అదే నాకు స్ఫూర్తిమంతంగా అనిపించింది. అత్యుత్తమ ఆటగాళ్లు ఉండటం కాదు.. అత్యుత్తమ వాతావరణం ఉండాలి’’ అని ఈ నెల మొదట్లో జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చాలా వరకు సోషల్‌మీడియాలో ఇటువంటి విమర్శలు గతంలో ముంబయిపై వినిపించేవి. బుమ్రా, మలింగా, రోహిత్‌, పాండ్యా బ్రదర్స్‌, డికాక్‌, ఇషాన్‌ వంటి వారితో ఆ జట్టు అత్యంత శక్తిమంతంగా ఉండేది.

మీకు ఎలానో వీరికీ అంతే..

పాండ్యా వ్యాఖ్యలపై స్పందించేందుకు ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ సమయం కోసం వేచి చూశాడు. ఇటీవల ఆకాశ్‌ మధ్వాల్‌ (5/5) ప్రదర్శనతో రోహిత్‌కు అద్భుతమైన అవకాశం లభించింది. రెండేళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌ చేరిన ముంబయి ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్‌నవూపై సంచలన విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు ఆకాశ్‌ తూటాల్లాంటి బంతులతో లఖ్‌నవూ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను పేకమేడలా కూల్చేశాడు. మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ జియో సినిమాతో మాట్లాడుతూ ‘‘నిజంగా చెబుతున్నాను బుమ్రా, హార్దిక్‌ ఉన్నప్పుడు ఎలా ఉందో.. అదే బాటలో వెళుతోంది. ఇప్పుడు తిలక్‌ వర్మ, నేహాల్‌ వధేరా అదే విధంగా ఆడుతున్నారు. రెండేళ్ల తర్వాత చూడండి.. ప్రజలు ఇది సూపర్‌ స్టార్లతో నిండిన జట్టు అంటారు. సోదరా.. మేము వారిని తయారు చేస్తున్నాం. మేము వెళ్లి వారి ఆటతీరును పరిశీలిస్తాం. మా జట్టు వెళ్లి వారిని ఇక్కడకు తెచ్చుకుంటోంది’’ అని రోహిత్‌ వివరించాడు. ఇది పాండ్యా వ్యాఖ్యలకు రోహిత్‌ సూటిగా చెప్పిన సమాధానం. వాస్తవానికి ముంబయి ఇండియన్స్‌ జట్టు దేశ వ్యాప్తంగా ప్రతిభావంతులను గుర్తించి వారిని సానపట్టేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. టీమిండియా మాజీ కోచ్‌ జాన్‌రైట్‌ ఇటీవల ముంబయి ఇండియన్స్‌ ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని మెచ్చుకొన్నాడు. రైట్‌ చాలా కాలం ముంబయి కోచ్‌గా వ్యవహరించాడు.

మరోవైపు ఎంఐ మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా రోహిత్ వ్యాఖ్యలకు మద్దతుగా ట్వీట్‌ చేశాడు. ‘‘ఎక్కడి గ్రాడ్యుయేషన్‌ మిమ్మల్ని సూపర్‌ స్టార్‌గా చేస్తుందో.. అలాంటి యూనివర్శిటీనే ముంబయి’’ అని పేర్కొన్నాడు. 2021 ఐపీఎల్‌లో అంచనాలకు తగ్గట్లు రాణించకపోవడంతో ముంబయి జట్టు హార్దిక్‌ను వదులుకొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడు గుజరాత్‌ బాధ్యతలు చేపట్టి నిరుడు ఆ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. తాజాగా హార్దిక్‌ వర్సెస్‌ ముంబయి మాటల యుద్ధం క్వాలిఫయర్‌-2ను మరింత ఆసక్తికరంగా మార్చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని