WTC Finals: కోహ్లీ, రోహిత్‌కు కూడా ఇబ్బందే!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు టీమ్ఇండియా ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడకపోతే విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ లాంటి మేటి ఆటగాళ్లు సైతం ఇబ్బంది పడతారని మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అభిప్రాయపడ్డారు...

Published : 07 Jun 2021 01:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు టీమ్ఇండియా ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడకపోతే విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ లాంటి మేటి ఆటగాళ్లు సైతం ఇబ్బంది పడతారని మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయన పీటీఐతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కోహ్లీ చాలా కాలంగా ఆడుతున్నాడు. ఇప్పుడతను ప్రపంచంలోని మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకడు. అతడితో పాటు రోహిత్‌ కూడా ప్రపంచశ్రేణి ఆటగాడు. వీరిద్దరూ తమ ప్రదర్శనల పట్ల, టీమ్‌ఇండియాకు విజయాలు అందించడం పట్ల ఎంతో గర్వంగా ఉంటారు. ప్రస్తుతం మంచి ఫామ్‌లోనూ ఉన్నారు. అయితే, ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ లేకపోవడం వాళ్లను ఇబ్బంది పెట్టొచ్చని భావిస్తున్నా’ అని వెంగ్‌సర్కార్‌ అన్నారు.

టీమ్‌ఇండియా ఇప్పుడు అత్యుత్తమ జట్టని, మంచి ఫామ్‌లోనూ ఉందని మాజీ క్రికెటర్‌ పేర్కొన్నారు. మరోవైపు న్యూజిలాండ్‌ లో ప్రొఫైల్‌ జట్టని, అదీ కాక టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు ఆ జట్టు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడుతుందని గుర్తుచేశారు. ఈ రెండు అంశాలు కివీస్‌కు లాభం చేకూరుస్తాయని చెప్పారు. దాంతో ఫైనల్స్‌లో టీమ్‌ఇండియా కన్నా న్యూజిలాండ్‌ విజయానికే కాస్త ఎక్కువ అవకాశాలున్నాయని వివరించారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియాకు సైతం రెండు మూడు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు అవసరమని పేర్కొన్నారు. అలా ఆడటం వల్ల అక్కడి పరిస్థితులకు అలవాటు పడొచ్చని, నెట్స్‌లో ఎంత సాధన చేసినా అది మ్యాచ్‌ ప్రాక్టీస్‌తో సమానం కాదని వెంగ్‌సర్కార్‌ చెప్పారు. ఎవరైనా పెద్ద మ్యాచ్‌లు ఆడేముందు కచ్చితంగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడాలని ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని