WTC Final: భారత టాప్‌ ఆల్‌రౌండర్లు.. వీరిద్దరిలో ఒకరికే అవకాశం: డీకే

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని (Border - Gavaskar Trophy) ఆసీస్‌పై 2-1 తేడాతో టీమ్‌ఇండియా సొంతం చేసుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC Final) ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆ మ్యాచ్‌లో ఆడే తుదిజట్టుపై ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది.

Published : 16 Mar 2023 10:51 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC Final) ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా తలపడనున్న విషయం తెలిసిందే. జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా తుది జట్టుపై ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది. పేస్ పిచ్‌లకు స్వర్గధామంగా ఉండే విదేశీ పిచ్‌లపై కూర్పు చాలా కీలకం. ఇదే అంశంపై టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ స్పందించాడు. తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు చోటు కష్టమేనని పేర్కొన్నాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలో ఒకరే ఉంటారని.. ఇక అక్షర్ పటేల్ స్క్వాడ్‌లోనూ ఉండకపోవచ్చని డీకే అభిప్రాయపడ్డాడు.

‘‘నిజాయతీగా చెప్పాలంటే రవీంద్ర జడేజా, అశ్విన్‌ ఫిట్‌గా ఉంటే.. అక్షర్ పటేల్‌కు చోటు దక్కడం దాదాపు అసాధ్యం. శార్దూల్‌ ఠాకూర్‌ జట్టులో చేరే అవకాశం ఉంది. ఇప్పుడు అందరిలోనూ మెదిలే అనుమానం ఏంటంటే స్పిన్నర్లు ఇద్దరూ తుది జట్టులో ఉంటారా..? గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ భారత్‌ ఇదే పొరపాటు చేసింది. ఇద్దరు స్పిన్నర్లతో ఆడింది. కానీ, బౌలింగ్‌లో మాత్రం గొప్పగా రాణించలేకపోయింది. అందుకే, ఈసారి అశ్విన్, జడేజాలో ఒకరు తుది జట్టులో ఉండబోరు. అయితే, బ్యాటింగ్‌ విషయానికి వస్తే అశ్విన్‌ కంటే జడేజా అత్యుత్తమ స్థాయిలో ఉన్నాడు’’ అని డీకే తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని