Dinesh Karthik: చెత్త రికార్డు.. రోహిత్‌ను సమం చేసిన దినేశ్ కార్తిక్‌

మంచి ఫినిషర్‌గా మారతాడని భావించిన దినేశ్‌ కార్తిక్‌ (DK) ఈసారి మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లోనూ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Published : 15 May 2023 17:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు, రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik)దారుణ ప్రదర్శనను కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ (RR vs RCB)  మరోసారి విఫలమై నిరాశపరిచాడు. ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో రెండో బంతికే డీకే వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే అంపైర్ తొలుత నాటౌట్‌గా ప్రకటించాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లిన రాజస్థాన్‌కు ఫలితం సానుకూలంగా వచ్చింది. దీంతో సున్నా పరుగులకే కార్తిక్‌ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో మరో చెత్త రికార్డును  తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో 16 సార్లు డకౌట్‌గా వెనుదిరిగిన బ్యాటర్‌గా అవతరించాడు. దీంతో ముంబయి కెప్టెన్ రోహిత్‌ రికార్డును సమం చేశాడు. 

రోహిత్ కూడా 239 మ్యాచుల్లోని 234 ఇన్నింగ్స్‌ల్లో 16 సార్లు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఇప్పుడు దినేశ్‌ కార్తిక్‌ 241 మ్యాచుల్లోని 220 ఇన్నింగ్స్‌ల్లో 16వ సారి డకౌట్‌ అయ్యాడు. వీరిద్దరి తర్వాత సునీల్ నరైన్ (161 మ్యాచుల్లోని 95 ఇన్నింగ్స్‌లు) 15సార్లు, మన్‌దీప్‌ సింగ్ (111 మ్యాచుల్లో 98 ఇన్నింగ్స్‌లు) 15 సార్లు, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మనీశ్ పాండే, అంబటి రాయుడు పద్నాలుగేసి డకౌట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. 

ఫినిషర్‌గా న్యాయం చేయలేక..

గతేడాది సీజన్‌లో లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అదరగొట్టిన దినేశ్‌ కార్తిక్‌ ‘ఫినిషర్‌’గా మారాడు. కానీ, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో తేలిపోయాడు. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ గత ప్రదర్శననే పునరావృతం చేస్తూ నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచుల్లో 140 పరుగులను మాత్రమే చేశాడు. అదీనూ 135.92 స్ట్రైక్‌రేట్‌తోనే ఆడటంపై విమర్శలు రేగాయి. కేవలం ఆరు సిక్స్‌లు, 13 ఫోర్లను కొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని