Team India: టీమ్ఇండియాకు ఎంపికైతే షారుఖ్‌ అదరగొడతాడు

టీమ్‌ఇండియాకు ఆడే అవకాశం వస్తే తమిళనాడు బ్యాట్స్‌మన్‌ షారుఖ్‌ ఖాన్‌ అద్భుతంగా రాణిస్తాడని, అతడేంటో నిరూపించుకుంటాడని వెటరన్‌ క్రికెటర్‌...

Published : 01 Feb 2022 01:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాకు ఆడే అవకాశం వస్తే తమిళనాడు బ్యాట్స్‌మన్‌ షారుఖ్‌ ఖాన్‌ అద్భుతంగా రాణిస్తాడని, అతడేంటో నిరూపించుకుంటాడని వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ పేర్కొన్నాడు. షారుఖ్‌ త్వరలోనే జాతీయ జట్టుకు ఎంపికవుతాడని చెప్పాడు. ఈ యువ బ్యాట్స్‌మన్‌ ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారే ట్రోఫీల్లో క్లిష్ట పరిస్థితుల్లో రాణించి తమిళనాడుకు మంచి విజయాలు అందించాడు. దీంతో ఆ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే త్వరలో టీమ్‌ఇండియాకు ఎంపికైతే అతడేంటో నిరూపించుకుంటాడని డీకే పూర్తి నమ్మకంతో ఉన్నాడు.

‘తమిళనాడు ఆటగాళ్లు బాగా రాణిస్తుండటం కెప్టెన్‌గా నాకు అమితమైన సంతోషాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే ఈ జట్టు నుంచి ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడున్న యువకులు కూడా జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్‌లో రాణించాలనుకుంటున్నారు. వాళ్లు బాగా ఆడితేనే ఇదంతా సాధ్యమవుతుంది. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో మా జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. దీంతో గతేడాది ఐపీఎల్‌లో మా జట్టు నుంచి 14 మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఇంత మంది అలా మెగా ఈవెంట్‌లో పాలుపంచుకోవడం నాకు ఆనందంగా ఉంది’ అని సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ చెప్పుకొచ్చాడు. అనంతరం షారుఖ్‌పై స్పందిస్తూ.. ‘షారుఖ్‌ టీమ్‌ఇండియా తలుపులు తట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకు చాలా దగ్గరగా ఉన్నాడు. త్వరలోనే అతడు ఎంపికవుతాడు. అతడికి అవకాశం వచ్చినప్పుడు రాణిస్తాడని చెప్పడంలో నాకెలాంటి సందేహం లేదు. టీమ్‌ఇండియా తరఫున అదరగొడతాడు’ అని కార్తీక్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని