Team India: కోహ్లీసేనే అత్యుత్తమం: డీకే

ప్రస్తుత టీమ్‌ఇండియానే అత్యుత్తమ భారత జట్టని వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ ‘విరాట్‌ కోహ్లీ’ బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తాడు. ఇప్పటివరకు ఆడిన భారత జట్లలో ఇదే గొప్పదని కొనియాడాడు...

Published : 09 Jun 2021 01:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత టీమ్‌ఇండియానే అత్యుత్తమ భారత జట్టని వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ ‘విరాట్‌ కోహ్లీ’ బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తాడు. ఇప్పటివరకు ఆడిన భారత జట్లలో ఇదే గొప్పదని కొనియాడాడు. తాను 1971 నాటి అజిత్‌ వాడేకర్‌ టీమ్‌ఇండియాను చూడలేదని, ఇప్పుడున్న కోహ్లీసేన అన్నింటికన్నా ప్రత్యేకమైన జట్టని అభినందించాడు. ఈ క్రమంలోనే బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలు బలంగా ఉన్నాయన్నాడు. జట్టులో కుర్రాళ్లు కూడా అవసరమైనంత మంది ఉన్నారని డీకే చెప్పుకొచ్చాడు.

‘టీమ్‌ఇండియా ఆడుతున్నప్పటి నుంచి ఇదే బలమైన టెస్టు జట్టుగా ఉండి ఉంటుంది. ఇప్పుడున్న జట్టులో అద్భుతమైన పేసర్లున్నారు. ప్రపంచశ్రేణి స్పిన్నర్లూ ఉన్నారు. మరోవైపు బ్యాటింగ్‌ లైనప్‌ కూడా ఎంతో బలంగా ఉంది. దాంతో పాటు అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ ఉన్నాడు. తద్వారా జట్టులో ఒక అదనపు బౌలర్‌ లేదా బ్యాట్స్‌మన్‌ను ఉపయోగించుకునే వీలుంది. భారత క్రికెట్‌లో ఇదే అత్యుత్తమ జట్టని నేను భావిస్తున్నా. ఇది నిజమే కాబట్టి కోహ్లీసేన ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆడుతోంది’ అని డీకే ఓ క్రీడా ఛానెల్‌తో అన్నాడు.

కాగా, టీమ్‌ఇండియా గతకొన్నేళ్లుగా ఇంటా బయటా అద్భుతమైన విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో మినహా అన్ని టెస్టు సిరీస్‌లూ గెలుపొందింది. దాంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఈనెల 18 నుంచి న్యూజిలాండ్‌తో తుదిపోరులో తలపడనుంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీసేన ఫైనల్లోనూ విజయం సాధించి తొలి టెస్టు ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను అందుకోవాలని తహతహలాడుతోంది. మరి కోహ్లీసేన ఏ మేరకు రాణిస్తుందో వేచిచూడాలి. మరోవైపు దినేశ్‌ కార్తీక్‌ ఈ తుదిపోరులో దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ సరసన కామెంట్రీ బాక్స్‌లో కూర్చొని వ్యాఖ్యానం చేయనున్న సంగతి తెలిసిందే. డీకే కొత్త ఇన్నింగ్స్‌లో ఎలా అలరిస్తాడో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని