IND vs BAN: టీమ్‌ఇండియా చేతిలో బలమైన ఆయుధం.. యువ ఆటగాడిపై డీకే ప్రశంసలు

సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లో అడుగుపెట్టిన కుల్‌దీప్‌ యాదవ్‌(Kuldeep yadav).. బంగ్లాపై అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలో కుల్‌దీప్‌ ఆటతీరుపై దినేశ్‌ కార్తిక్‌ ప్రశంసలు గుప్పించాడు. 

Published : 16 Dec 2022 12:51 IST

చట్‌గావ్‌: బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టు(IND vs BAN)లో భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిపత్యాన్ని సాధించింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయింది. కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా ప్రత్యర్థి రాణించడానికి ఎలాంటి అవకాశాలు లేకుండా చేసింది. రెండేళ్ల విరామం తర్వాత టెస్టుల్లోకి అడుగుపెట్టిన లెఫ్ట్‌ హ్యాండ్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌(Kuldeep yadav) ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో అద్భుతంగా ఆడాడు. భారత్‌ 404 పరుగులు సాధించడంలో అతడి ఆటగాడు కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ఔటయ్యాక తర్వాత అశ్విన్‌, కుల్‌దీప్‌ కలిసి ఎనిమిదో వికెట్‌కు బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ నేపథ్యంలో కుల్‌దీప్‌పై టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ ప్రశంసలు కురిపించాడు. 

‘‘షకిబ్‌ అల్‌ హసన్‌కు అతడు వేసిన తొలి ఓవర్‌ రెండో బంతి నన్ను కట్టిపడేసింది. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో షకిబ్‌కు మంచి అనుభవం ఉంది. అలాంటి ఆటగాడిని సైతం కుల్‌దీప్‌ ఇరుకున పెట్టాడు. అతడిది నిజంగా అద్భుతమైన బౌలింగ్‌. ఈ బంతి అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అద్భుతమైన స్పెల్‌ వేసేందుకు నాంది పలికింది. అక్కడి నుంచి కుల్‌దీప్‌ తన జోరు చూపించాడు. గొప్ప బ్యాటర్లను సైతం పెవిలియన్‌ బాట పట్టేలా చేశాడు. ఆ బంతి ఆడిన తర్వాత మైదానంలోకి వచ్చిన బ్యాటర్ల ఆటతీరు చూస్తే వారిని కుల్‌దీప్‌ ఎంతగా ఇబ్బంది పెట్టాడో అర్థమవుతుంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌ ముంగిట ఆటగాళ్లకు ఈ స్కోరు మరింత ఉత్సాహాన్నిస్తుంది. రానున్న రోజుల్లో కుల్‌దీప్‌ టీమ్‌ఇండియాకు మంచి ఆయుధంగా మారనున్నాడు’’ అంటూ దినేశ్‌ కార్తిక్‌(Dinesh karthik) వివరించాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన మొదటి ఓవర్‌ రెండో బంతికే బంగ్లా కెప్టెన్‌ షకిబ్‌ వికెట్‌ను దక్కించుకొన్నాడు. స్లిప్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ అందుకోవడంతో.. కేవలం మూడు పరుగులకే షకిబ్‌ పెవిలియన్‌కు చేరుకున్నాడు. అప్పటికి బంగ్లా స్కోరు 75/5. కుల్‌దీప్‌ ఈ ఇన్నింగ్స్‌లో నురుల్‌ హసన్‌(16), ముష్ఫికర్‌ రహీం(28), తైజుల్‌ ఇస్లాం(0) వికెట్లను ఈ ఆటగాడు పడగొట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని