The Hundred: సరికొత్త పాత్రలో డీకే

టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాజీ సారథి దినేశ్ కార్తీక్‌ సరికొత్త పాత్రకు సిద్ధమయ్యాడు. ఈసీబీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న.....

Published : 16 May 2021 00:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాజీ సారథి దినేశ్ కార్తీక్‌ సరికొత్త పాత్రకు సిద్ధమయ్యాడు. ఈసీబీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న ‘ది హండ్రెడ్’కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. లీగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న స్కై స్పోర్ట్స్‌ సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది.

ప్రస్తుతం దినేశ్ కార్తీక్‌ టీమ్‌ఇండియా పరిగణనలో లేడు. వయసు పెరగడంతో అతడు కేవలం తమిళనాడుకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ముగిసిన సయ్యద్‌ ముస్తాక్ అలీ, విజయ్‌ హజారేలో జట్టును విజయవంతంగా నడిపించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్నాడు. గతేడాది సారథ్యం నుంచి వైదొలగినా అతడి ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు. ఈ ఐపీఎల్‌ సీజన్‌ నిరవధికంగా వాయిదా పడటంతో ‘ది హండ్రెడ్‌’లో సరికొత్త పాత్ర పోషించేందుకు నిర్ణయించుకున్నాడు.

ఆండ్రూ ఫ్లింటాఫ్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, కెవిన్‌ పీటర్సన్‌, కుమార సంగక్కరతో కూడిన బృందంతో కలిసి కార్తీక్‌ పనిచేయనున్నాడు. జులై 21న ఈ టోర్నీ ఆరంభం కానుంది.  కాస్‌ నయీదూ, జైనబ్‌ అబ్బాస్‌, జాక్వెలైన్‌ షెఫర్డ్‌, టామీ బ్యూమాంట్‌, డారెన్‌ సామి, మెల్‌ జోన్స్‌, వసీమ్‌ అక్రమ్‌, లిడియా గ్రీన్‌వే సైతం కామెంటరీ ప్యానెల్‌లో ఉన్నారు. నాసర్‌ హుస్సేన్‌, ఈబోనీ రైన్‌ఫోర్డ్‌ బ్రెంట్‌, రాబ్‌ కీ, ఇయాన్‌ వార్డ్‌, డేవిడ్‌ లాయిడ్‌, నిక్‌ నైట్‌, మైక్ ఆర్థర్‌టన్‌, మార్క్‌ బౌచర్‌  స్కై స్పోర్ట్స్‌లో ఎప్పట్నుంచో విశ్లేషకులుగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని