Karthik - Vihari: విహారీ.. ఏమా షాట్‌..? అది రివర్స్‌ స్వీప్‌ కాదు.. రివర్స్‌ స్లాప్‌: డీకే

రంజీ ట్రోఫీ (Ranji Trophy) క్వార్టర్ ఫైనల్‌లో మధ్యప్రదేశ్ చేతిలో ఆంధ్రా జట్టు (Andhra Pradesh) ఓడినప్పటికీ.. ఆ టీమ్‌ ప్లేయర్ హనుమ విహారి (Hanuma Vihari) ఆటతీరు మాత్రం అందరినీ ఆకట్టుకొంది. 

Updated : 03 Feb 2023 20:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: హనుమ విహారి.. 2020-21 బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఆసీస్‌పై వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడిన టీమ్‌ఇండియా ఆటగాడు. తాజాగా రంజీ ట్రోఫీలోనూ అతడు చూపించిన తెగువ అభిమానుల ప్రశంసలను అందుకొంది. మణికట్టులో చీలిక కారణంగా ఇబ్బంది పడినప్పటికీ.. జట్టు కోసం బ్యాటింగ్‌కు రావడం విశేషం. ఈ క్రమంలో విహారి ఆడిన ఓ షాట్‌ను టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ అభినందిస్తూ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ‘‘ఇది రివర్స్‌ స్వీప్‌ కాదు.. రివర్స్ స్లాప్‌ (నవ్వుతున్న ఎమోజీ). ఇందులో బౌలర్‌ తప్పిదం ఏమీ లేదు. అయితే ఇదొక విభిన్నమైన షాట్’’ అని వీడియోను జోడిస్తూ డీకే కామెంట్‌ చేశాడు.

ఆంధ్రా జట్టు తరఫున ఆడుతున్న హనుమ విహారి కీలకమైన క్వార్టర్‌ ఫైనల్‌లో మధ్యప్రదేశ్‌పై 11వ స్థానంలో దిగి మరీ మూడు ఫోర్ల సాయంతో 15 పరుగులు చేశాడు. కానీ చివరికి మధ్యప్రదేశ్‌పై ఆంధ్రకు ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 379/10 స్కోరు సాధించగా.. మధ్యప్రదేశ్‌ 228/10 చేయడంతో ఆంధ్ర 151 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర కేవలం 93 పరుగులకే కుప్పకూలింది. దీంతో 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌.. ఐదు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. దీంతో క్వార్టర్ ఫైనల్‌లో ఓటమితో ఆంధ్రా జట్టు ఇంటిముఖం పట్టింది. హనుమ విహారికి మణికట్టుకు దెబ్బ తగలడం ఆంధ్రప్రదేశ్‌కు ఎదురు దెబ్బ తగిలింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని