INDvsAUS: అప్పుడు నేను బాల్‌బాయ్‌గా ఉన్నా‌ 

2001 ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా టెస్టు ప్రపంచ క్రికెట్‌లో అతిగొప్ప మ్యాచ్‌ల్లో ఒకటని టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సందర్భంగా క్రికెట్‌  వ్యాఖ్యాతలు పేర్కొన్నారు...

Published : 20 Jun 2021 01:36 IST

2001 భారత్‌xఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో దినేశ్‌ కార్తీక్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: 2001 ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా టెస్టు ప్రపంచ క్రికెట్‌లో అతిగొప్ప మ్యాచ్‌ల్లో ఒకటని టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సందర్భంగా క్రికెట్‌  వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. అయితే, ఆ సిరీస్‌లో చెన్నైలో జరిగిన మూడో టెస్టుకు తాను బాల్‌బాయ్‌గా ఉన్నానని వెటరన్‌ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని ఏజీస్‌బౌల్‌ మైదానంలో భారత్‌, న్యూజిలాండ్ జట్లు తుదిపోరులో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌కు డీకే ఒక వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు మాట్లాడుతూ నాటి విశేష టెస్టు సిరీస్‌పై ఇలా స్పందించాడు.

‘ఈడెన్‌ టెస్టు తర్వాత జరిగిన మూడో మ్యాచ్‌లో నేను బాల్‌బాయ్‌గా ఉన్నా. అప్పుడు భారత్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు బంతి అందించడం మధురానుభూతి. ఆరోజుల్లో నేను 8 గంటలకు నిద్రలేచి టీవీ ఆన్‌ చేసేవాడిని. అలా ఈడెన్‌ టెస్టును టీవీలో వీక్షించా. అయితే, నాలుగో రోజు రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఫాలోఆన్‌లో వికెట్‌ పడకుండా ఆడారు. ఒక యవ క్రికెటర్‌గా అలాంటి ఇన్నింగ్స్‌ చూడటం అత్యద్భుతం. ఆ సమయంలో ఆస్ట్రేలియా అతిగొప్ప జట్టుగా పేరుండేది’ అని డీకే గుర్తు చేసుకున్నాడు. కాగా, ఈడెన్‌లో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఫాలోఆన్‌ ఆడి మరీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్‌ ద్రవిడ్‌(180), వీవీఎస్‌ లక్ష్మణ్‌(281) అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి జట్టు స్కోరును 657/7కి తీసుకెళ్లారు. ఇక చివరి రోజు హర్భజన్‌సింగ్‌ 6/73 విజృంభించడంతో పాటు హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. అనంతరం చెన్నైలో జరిగిన మూడో టెస్టులోనూ భారత్‌ విజయం సాధించి ఆ సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని