WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌.. పిచ్‌పై తగ్గిన పచ్చిక.. వైరల్‌గా మారిన దినేశ్ కార్తిక్‌ ఫొటోలు!

టెస్టు మహా సమరానికి సమయం ఆసన్నమైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ మైదానం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Published : 07 Jun 2023 11:00 IST

ఇంటర్నెట్ డెస్క్: రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్‌ఇండియా (Team India) నేడు ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో (WTC Final) తలపడేందుకు సిద్ధమైంది. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్‌ చేరిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్ మైదానం వేదికగా టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఫాస్ట్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్న క్రమంలో.. టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్ ఓవల్ పిచ్‌ ఫొటోలను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్‌కు పిచ్‌ సిద్ధం. ముందు రోజు (జూన్ 5న) తొమ్మిది మిల్లీ మీటర్ల పచ్చిక ఉంది. మంగళవారం (జూన్ 6న) ఆరు మిల్లీ మీటర్లకు తగ్గించినట్లు అనిపిస్తోంది. ఒకవేళ మీరు టాస్‌ నెగ్గితే ఏం ఎంచుకుంటారు?’’ అని పోస్టు చేశాడు. 

దినేశ్‌ కార్తిక్‌ చేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. తాము తొలుత బౌలింగ్‌ ఎంచుకుంటామని కొందరు సమాధానం ఇవ్వగా.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండొచ్చని మరికొందరు వెల్లడించారు. పిచ్‌పై పచ్చిక ఎక్కువగా లేకపోవడంతో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం వెల్లడైంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని కొందరు కామెంట్లు పెట్టారు. 

‘‘తొలుత బౌలింగ్‌ ఎంచుకోవాలి. కనీసం రెండు రోజు తర్వాతైనా మనవాళ్లకు టీ20 హ్యాంగోవర్‌ కాస్త దిగుతుంది’’

‘‘డీకే భాయ్‌.. మంచి పని చేస్తున్నావ్‌. ఇదే నీకు తగినది. ఇంకెప్పుడూ బ్యాట్‌, కీపింగ్‌ గ్లవ్స్‌ను ముట్టొద్దు’’

‘‘మ్యాచ్‌ సమయానికి పచ్చికను 3 mmకి చేస్తారేమో’’

‘‘వాతావరణం పొడిగా ఉంటే తప్పకుండా బ్యాటింగ్‌నే ఎంచుకోవాలి. అయితే, తొలి సెషన్‌ చాలా నిదానంగా ఆడాలి. రెండు వికెట్లను కోల్పోకుండా చూడాలి. అలా చేస్తే మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 350+ పరుగులు చేయగలదు. అప్పుడు సిరాజ్‌, షమీ, ఠాకూర్‌, ఉమేశ్‌తో కూడిన పేస్‌ దళం ఆసీస్‌ను నిలువరించే అవకాశం ఉంది’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని