IND vs AUS: టాప్‌ఆర్డర్‌ వైఫల్యం.. ఆ వాస్తవాన్ని దాచిపెట్టలేం కదా..: దినేశ్‌ కార్తిక్‌

టెస్టు సిరీస్‌లో వరుస విజయాలతో కొనసాగుతున్న టీమ్‌ఇండియాకు (Team India) ఆసీస్‌ షాక్‌ ఇచ్చింది. సిరీస్‌ను ఖాతాలో వేసుకుందామని భావించిన భారత్‌కు నిరాశే ఎదురైంది. ఇప్పుడు చివరి టెస్టులో విజయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే, మూడో టెస్టులో వైఫల్యం మీద ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది.

Published : 05 Mar 2023 18:25 IST

ఇంటర్నెట్ డెస్క్: నాలుగు టెస్టుల బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) టీమ్‌ఇండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. చివరి టెస్టు మ్యాచ్‌ మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా (IND vs AUS)  ప్రారంభం కానుంది. అయితే, వరుసగా రెండు టెస్టుల్లో గెలిచిన టీమ్‌ఇండియా మూడో టెస్టులో మాత్రం తేలిపోయింది. ఈ క్రమంలో భారత సీనియర్ ఆటగాడు, ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. స్పిన్‌ పిచ్‌పై ఆసీస్‌ బౌలర్లను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు ఇబ్బందిగా మారిందని చెప్పాడు. టాప్‌ ఆర్డర్‌ వైఫల్యం దాచిపెట్టలేమని వ్యాఖ్యానించాడు. 

‘‘ఏడుగురు బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఆ చేదునిజాన్ని ఎప్పటికీ దాచిపెట్టలేము. నేను స్థిరంగా కొనసాగుతున్న పతనాల గురించి మాట్లాడుతున్నా.  ఈ పిచ్‌ మీద బ్యాటింగ్‌ చేయడం కష్టమేనా..? అంటే నిజంగా చాలా కష్టమే. అయితే, జట్టుగా ఇక్కడ ఆడేందుకు ఎంపిక చేసుకున్న తర్వాత పరిస్థితులను మనవైపే తిప్పుకోవాలి. క్లిష్టపరిస్థితుల్లో ఆడగల సత్తా ఉన్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కఠినమైన పిచ్‌లపైనా విజయం సాధించారు. అయితే, అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడటం మాత్రం కాస్త విభిన్నమైందే. కానీ, వరుసగా అవుట్‌ కావడం మాత్రం బ్యాటర్‌ సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తించేవే. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. భారీ షాట్లు ఆడి మనపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నించడం మంచిదే కానీ, ఆచరణలో చాలా కష్టం. ఆ విషయంలో మాత్రం భారత బ్యాటర్లకు మద్దతుగా నిలుస్తా. కానీ, గత రెండు టెస్టుల్లోనూ లోయర్ ఆర్డర్‌ చాలా విలువైన పరుగులు సాధించిన విషయం మరువకూడదు. గతంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లోనూ భారత టాప్‌ ఆర్డర్‌ ఇబ్బంది పడింది’’ అని దినేశ్ కార్తిక్‌ వెల్లడించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు