
chahar : చాహర్ ‘పోరాట స్ఫూర్తి’ సూపర్.. గతం గుర్తు చేసుకున్న కార్తిక్
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాపై మూడో వన్డేలో భారత్ ఓడిపోవడంతో ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ కంటతడి పెట్టిన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కదలించాయి. ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టడంతోపాటు క్లిష్టసమయంలో అర్ధశతకం సాధించాడు. అయినా, టీమ్‌ఇండియాకు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో దీపక్ చాహర్ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ కూడా దీపక్‌ను అభినందించాడు. ఇలాంటి అద్భుత ఇన్నింగ్స్‌లను చాహర్ గతంలోనూ ఆడాడని గుర్తు చేశాడు. దేశవాళీలో రాజస్థాన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడని వివరించాడు. 2019-20 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో రాజస్థాన్‌ను సెమీస్‌కు చేర్చాడని పేర్కొన్నాడు. కార్తిక్ సారథ్యం వహించిన తమిళనాడు చేతిలోనే రాజస్థాన్ ఓడటం గమనార్హం.
‘‘రెండేళ్ల కిందట సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో భాగంగా రాజస్థాన్ జట్టు కేరళలో ఆడింది. ఒక్కో గ్రూప్‌లో ఆరు జట్లు ఉన్నాయి. తమిళనాడు, రాజస్థాన్ ఒకే గ్రూప్. మేం (తమిళనాడు) ఎక్కువ విజయాలతో గ్రూప్ స్టేజ్‌ను ముగించాం. అయితే, మొదటి మూడు మ్యాచుల్లో రాజస్థాన్ జట్టులో దీపక్ చాహర్ లేడు. ఆ మూడింటిలో రాజస్థాన్ కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి రెండు మ్యాచుల్లో ఓడింది. ఎప్పుడైతే దీపక్ వచ్చాడో.. రాజస్థాన్ మిగతా మూడు మ్యాచుల్లోనూ గెలిచి సూపర్ లీగ్ దశకు దూసుకెళ్లింది. అక్కడా కర్ణాటక, ముంబయి వంటి పటిష్ఠమైన జట్లపై విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో మేం గెలిచినా.. అక్కడిదాకా దీపక్ జట్టును నడిపించిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఎప్పుడూ పోరాట స్ఫూర్తితో ఉంటాడు. అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు నిరంతరం కష్టపడతాడు’’ అని కార్తిక్ తెలిపాడు.