T20 World Cup 2024: మా నిష్క్రమణకు నాదే బాధ్యత.. పిచ్‌లపై నిందలేయను: హసరంగ

కనీసం సూపర్-8కి అర్హత సాధించడంలోనూ శ్రీలంక క్రికెట్ జట్టు విఫలమైంది. నాణ్యమైన క్రికెటర్లు ఉన్నప్పటికీ సమష్టిగా రాణించడంలో తేలిపోవడం ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేసింది.

Updated : 17 Jun 2024 17:09 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) నుంచి ఆసియా దేశం శ్రీలంక లీగ్‌ స్టేజ్‌లోనే నిష్క్రమించింది. గ్రూప్‌-Dలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ చేతుల్లో ఓడిపోయిన లంకకు అప్పుడే సూపర్-8 అవకాశాలు సన్నగిల్లాయి. నేపాల్‌తో మ్యాచ్‌ రద్దు కావడం మరింత దెబ్బ కొట్టింది. చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించినా నామమాత్రమే కావడంతో శ్రీలంక ఇంటిముఖం పట్టక తప్పలేదు. తమ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని శ్రీలంక కెప్టెన్ హసరంగ స్పష్టం చేశాడు. నెదర్లాండ్స్‌తో విజయం అనంతరం హసరంగ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. మ్యాచ్‌ల కోసం ఎక్కువగా ప్రయాణాలు చేయడం కూడా తమపై ప్రభావం చూపిందని వ్యాఖ్యానించాడు.

‘‘మేం తొలి మ్యాచ్‌ను న్యూయార్క్‌ వేదికగా ఆడాం. అక్కడ ఓడిపోయాం. తర్వాత డల్లాస్‌కు చేరుకుని ఆడాల్సి వచ్చింది. పిచ్‌ పరిస్థితులకు త్వరగా అడ్జస్ట్‌ కాలేదు. కారణాలు ఏమైనా సరే కెప్టెన్‌గా మా ఓటమికి నాదే పూర్తి బాధ్యత. పరాజయంపాలైనప్పుడు మనం పిచ్‌లపైనే నెపం మోపేస్తాం. కానీ, ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా అలా చేయను. ఇతర జట్లూ ఇదే పిచ్‌లపై మ్యాచ్‌లను ఆడాయి. మనం ఎంత త్వరగా అడ్జస్ట్‌ అయ్యామనేది కీలకం. దేశం తరఫున భారీ టోర్నీలో ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. ఇతర అంశాలను కారణంగా చూపకుండా.. మా జట్టులోని లోటుపాట్లపై దృష్టిసారిస్తాం’’ అని హసరంగ తెలిపాడు. 

రెండో బౌలర్‌గా సందీప్‌ లామిచానె రికార్డు

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ బౌలర్ సందీప్ లామిచానె ఓ రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వంద వికెట్లు అత్యంత వేగంగా తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. బంగ్లాపై రెండు వికెట్లు తీసిన లామిచానె.. మొత్తం 54 మ్యాచుల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకొన్నాడు. అతడి కంటే ముందు అఫ్గాన్‌ కెప్టెన్ రషీద్‌ ఖాన్ 53 మ్యాచుల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. అత్యాచార కేసు ఆరోపణలతో అతడికి 8 ఏళ్ల జైలు శిక్ష కూడా పడింది. అయితే, దానిపై ఉన్నత న్యాయస్థానాల్లో పోరాడి బయటపడ్డాడు. ఎట్టకేలకు వరల్డ్‌ కప్‌లో ఆడే అవకాశం వచ్చింది. అయితే, నేపాల్‌ తరఫున ఆడేందుకు ఐసీసీ నుంచి అనుమతులు ఆలస్యం కావడం.. యూఎస్ వీసా కూడా రాలేదు. చివరికి ఐసీసీ నుంచి అప్రూవ్‌ వచ్చాక వీసా సమస్య తీరింది. దీంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సమయానికి అమెరికా చేరుకున్నాడు. ఆ మ్యాచ్‌లో వికెట్‌ తీయకపోయినా.. పరుగులను (0/18) కట్టడి చేశాడు. ఇప్పుడు బంగ్లాపై నేపాల్‌ ఓడినప్పటికీ అతడి బౌలింగ్‌ ప్రదర్శన ఆకట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని