షమీ-అక్తర్‌ ట్విటర్‌ వార్‌ : అగ్నికి ఆజ్యం పోయకండి.. పాక్‌ మాజీ ఆటగాళ్ల అభ్యర్థన

షమీ-అక్తర్‌ ట్విటర్‌ వార్‌ నేపథ్యంలో.. సామాజిక మాధ్యమాల్లో ఎవరూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయొద్దంటూ పాక్‌ మాజీ ఆటగాళ్లు అభ్యర్థించారు.

Published : 16 Nov 2022 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : సెమీస్‌లో టీమ్‌ఇండియా దారుణ ఓటమి అనంతరం పాక్‌ మాజీ ఆటగాళ్లు భారత్‌పై విమర్శలు ఎక్కుపెట్టి ఎద్దేవా చేస్తే.. ఫైనల్‌లో పాక్‌ పరాజయం అనంతరం అదే రీతిలో ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భారత పేసర్‌ షమీ, పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ మధ్య ట్వీట్ల యుద్ధమే జరిగింది. ఒకరికొకరు దీటుగా సమాధానాలిచ్చుకోవడంతో వాతావరణం వేడెక్కింది. దీంతో పాక్‌ మాజీ ఆటగాళ్లు రంగంలోకి దిగి సామాజిక మాధ్యమాల్లో ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ అభ్యర్థించారు.

షమీ - అక్తర్‌ ఎపిసోడ్‌పై పాక్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ స్పందించాడు. భారత్‌, పాక్‌ ఆటగాళ్లంతా శాంతంగా ఉండటానికి ప్రయత్నించాలని.. ఇలాంటి ట్విటర్‌ వార్‌ మరోసారి జరగకుండా చూసుకోవాలని కోరాడు.


మాజీలైనా, ప్రస్తుత ఆటగాళ్లైనా.. భారత్‌, పాక్‌ ఆటగాళ్లు కలిసి ఉండేలా చూడాలి. మన వ్యాఖ్యలు, ట్వీట్లు పాజిటివ్‌గా ఉండాలి. తటస్థంగా స్పందించాలి. భారత ఆటగాళ్లకు దేశభక్తి ఉంది. మనకూ మన దేశంపై భక్తి ఉంది. ఈ సమయంలో అగ్నికి ఆజ్యం పోయొద్దు. ట్వీట్లపై ట్వీట్లు చేయొద్దు

- పాక్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌


కేవలం కొన్ని లైక్‌ల కోసం మీరు ఇలాంటివి చేయొద్దు. భారత్‌, పాక్‌ ఆటగాళ్లైనా.. మరే దేశ ప్లేయర్లైనా.. మనమంతా ఒక కుటుంబం. ఒకరికొకరం గౌరవించుకోవాలి. అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి’

- పాక్‌ మాజీ కెప్టెన్‌ మిస్బా ఉల్‌ హాక్‌


క్రికెటర్లుగా మనమంతా రాయబారులం. భారత్, పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను ఆపేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. అంతే కానీ ప్రజల్లో విద్వేషాలను వ్యాప్తి చేసేలా ఉండకూడదు

పాక్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది


పాక్‌ మాజీ ఆటగాళ్లు వకార్‌ యూనిస్‌, షోయబ్‌ మాలిక్‌లు కూడా ఆటగాళ్లు ఒకరికొకరు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదని కోరారు.

వివాదం ఇలా..

భారత్‌పై చాలా సార్లు విమర్శలు గుప్పించిన పాక్‌ మాజీ ఆటగాడు షోయబ్‌ అక్తర్‌.. ఫైనల్‌లో పాక్‌ ఓటమి అనంతరం ట్విటర్‌లో హృదయం ముక్కలైన ఎమోజీ పెట్టాడు. దీనిపై షమీ స్పందిస్తూ..‘‘సారీ బ్రదర్. దీనినే కర్మ అంటారు’’ అని ట్వీట్‌ చేశాడు. దీంతో వీరి మధ్య ట్విటర్‌ వార్‌ మొదలైంది. అయితే షమీ ట్వీట్‌కు ప్రతిస్పందనగా షోయబ్‌ అక్తర్‌ కూడా ప్రముఖ వ్యాఖ్యాత హర్షాభోగ్లే పాక్‌ బౌలింగ్‌ను మెచ్చుకుంటూ చేసిన వ్యాఖ్యలను జత చేస్తూ ట్వీట్‌ చేశాడు. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో ఈ మాటల యుధ్దాన్ని ఆపాలని పాక్‌ మాజీ ఆటగాళ్లు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని