IND vs AUS : ఇది కోహ్లీ అత్యుత్తమ ఇన్నింగ్స్‌ కాదు.. విరాట్‌ 28వ సెంచరీపై మార్క్‌వా

చాలా రోజుల తర్వాత విరాట్‌ కోహ్లీ(Virat Kohli) సాధించిన టెస్టు సెంచరీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మార్క్‌ వా(Mark Waugh).. కాస్త భిన్నంగా స్పందించాడు.

Published : 15 Mar 2023 18:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  టెస్టుల్లో మరోసారి మూడంకెల స్కోరు చేరుకోవడానికి విరాట్‌ కోహ్లీ(Virat Kohli)కి దాదాపు మూడున్నరేళ్ల సమయం పట్టింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ(Border Gavaskar Trophy)లోని చివరి టెస్టు(IND vs AUS)తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులు చేసి.. తన సెంచరీ కరవును తీర్చుకోవడమే కాకుండా.. విమర్శకులకు ఈ ఇన్నింగ్స్‌తోనే సమాధానమిచ్చాడు విరాట్‌. ఈ శతకంపై పలువురి క్రికెటర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఆసీస్‌ మాజీ ఆటగాడు మార్క్‌వా(Mark Waugh) మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు.

నాగ్‌పుర్‌ టెస్టు(Nagpur Test)లో క్యాచ్‌లు డ్రాప్‌ చేశాడని కోహ్లీపై విమర్శలు గుప్పించిన వా.. నాలుగో టెస్టులో కోహ్లీ ఇన్నింగ్స్‌ను మెచ్చుకున్నాడు. అయితే.. కోహ్లీ అసలైన అత్యుత్తమం మాత్రం ఇది కాదని చెప్పాడు.

‘‘కోహ్లీ సెంచరీ కరవు తీరింది. పరుగుల గేట్లు తెరుచుకున్నాయి. కానీ.. అతడు చాలా తక్కువ రిస్కీ షాట్లు ఆడాడు. ఎంతో ఓపికగా ఉన్నాడు. అయితే.. అతడి టెస్టు కెరీర్‌ను పరిశీలిస్తే.. ప్రస్తుతానికి అతడి అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఇదేనని నేను అనుకోవడం లేదు. కానీ ఇది అతడిలోని క్లాస్‌ ఆట’’ అని మార్క్‌వా విశ్లేషించాడు.

మొదటి టెస్టులో స్లిప్‌లో ఉన్న కోహ్లీ.. స్మిత్‌, హాండ్స్‌కాంబ్‌ క్యాచ్‌లను వదిలివేయడంపై కామెంటరీ బాక్స్‌ నుంచి వా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక కోహ్లీ ఈ మ్యాచ్‌లో తన 28వ టెస్టు సెంచరీని నమోదు చేయగా.. మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 75 శతకాలు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని