Shikhar Dhawan: ధావన్‌ కెరీర్‌ ఇంకా ముగిసిపోలేదు: సంజయ్‌ బంగర్‌

శిఖర్‌ ధావన్‌(Shikhar Dhawan) కెరీర్‌ ఇంకా ముగిసిపోలేదంటూ టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

Published : 03 Jan 2023 17:18 IST

దిల్లీ: శ్రీలంకతో వన్డే సిరీస్‌(IND vs SL) జట్టులో సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. శ్రీలంకతో టీ20లకు దూరమైన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ మాత్రం ఈ వన్డేలో ఆడుతున్నారు. బంగ్లాదేశ్‌తో పేలవమైన ప్రదర్శన కారణంగా ఇక ధావన్‌ కెరీర్‌ ముగిసినట్టేనా? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా(Team India) మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రానున్న వన్డే జట్టులో ఈ సీనియర్‌ ఆటగాడి రీఎంట్రీని కొట్టిపారేయలేమని అన్నాడు. 

‘‘శిఖర్‌ ధావన్‌ అవకాశాల విషయంలో నేను ఇప్పటికీ నమ్మకంగానే ఉన్నాను. ఎందుకంటే, అతడు చాలా ఫిట్‌గా ఉన్నాడు. గొప్పగా ఆడుతున్నాడు. ఇటీవల ఓ రెండు సిరీస్‌లలో ఎక్కువ పరుగులు చేయలేకపోయినప్పటికీ.. అతడు భారత్‌ తరఫున యువ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ధావన్‌(Shikhar Dhawan) తిరిగి జట్టులోకి రావచ్చు. ఎందుకంటే కుడి, ఎడమ చేతివాటం గల కాంబినేషన్‌లో భారత్‌ గొప్ప విజయాలను అందుకొన్న సందర్భాలున్నాయి. 2011 ప్రపంచకప్‌ జట్టులో గౌతమ్‌ గంభీర్‌, సురేశ్‌ రైనా, యువరాజ్‌ సింగ్‌ వంటి లెఫ్ట్ హ్యండర్‌ ఆటగాళ్లు ఉన్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి లెఫ్ట్‌ హ్యాండర్లు ఆటపై కీలక ప్రభావం చూపగలరనే విషయం స్పష్టమవుతోంది’’ అంటూ బంగర్‌ పేర్కొన్నాడు. ఒకవేళ ఇషాన్‌ వంటి ఆటగాళ్లు వన్డే ప్రపంచకప్‌ సమయానికి అందుబాటులోకి లేకపోతే ధావన్‌ జట్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ మాజీ కోచ్‌ పేర్కొన్నాడు. 

ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఇషాన్‌ కిషన్‌ ద్విశతకాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. శుభ్‌మన్‌ గిల్‌ సైతం ఈ ఫార్మాట్‌లో నిలకడగా ఆడుతూ రాణించాడు. దీంతో ధావన్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. శ్రీలంకతో టీ20 సిరీస్‌ అనంతరం ఈ నెల 10, 12, 15 తేదీల్లో గువాహటి, కోల్‌కతా, తిరువనంతపురం వేదికలుగా వన్డే సిరీస్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని