Virat Kohli : కోహ్లీ పని అయిపోయిందనుకోవద్దు : విక్రమ్‌ రాథోడ్‌

విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ అన్నాడు. త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో కచ్చితంగా భారీగా పరుగులు..

Published : 14 Feb 2022 18:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ అన్నాడు. త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో కచ్చితంగా భారీగా పరుగులు చేస్తాడన్న విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో కోహ్లీ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. మూడు వన్డేల్లో కలిపి 8.6 సగటుతో 26 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 18 మాత్రమే. 

‘కోహ్లీ ఫామ్‌ కోల్పోయాడని చెప్పడం సరికాదు. నెట్స్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడు. అతడి కెరీర్లో ఇదొక దశ మాత్రమే. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో విఫలమైన విషయం వాస్తవమే. కానీ, అదే జట్టుతో త్వరలో జరుగనున్న టీ20 సిరీస్‌లో అతడు భారీ ఇన్నింగ్స్‌ ఆడతాడనే నమ్మకం ఉంది. అలాగే, మా బ్యాటింగ్‌ విభాగంలో ఎలాంటి సమస్యలు లేవు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా రాణించగలిగే సామర్థ్యం మా ఆటగాళ్లకుంది. త్వరలో ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని మేం ప్రయోగాలు చేస్తున్నాం. ప్రస్తుతం కొంత మంది ఆటగాళ్లు గాయాల బారిన పడి జట్టుకు దూరం కావడం దురదృష్టకరం. వాళ్లంతా అందుబాటులోకి వస్తే.. జట్టులో ఎవరి పాత్రేంటో నిర్ధారించడం కొంచెం కష్టమే’ అని విక్రమ్‌ రాథోడ్ పేర్కొన్నాడు. భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఫిబ్రవరి 16 (బుధవారం) నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది.

* మిడిల్‌ ఆర్డర్‌లోనే పంత్‌..

‘మిడిల్‌ ఆర్డర్లో బ్యాటింగ్‌కి దిగి సత్తా చాటగలిగే అతి తక్కువ మంది ఎడమ చేతివాటం బ్యాటర్లలో రిషభ్ పంత్‌ ఒకడు. అందుకే, అతడిని మిడిల్‌ ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌కి పంపుతాం. 2023 వన్డే ప్రపంచకప్‌ జట్టులో అతడు కీలక ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే, విండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు కేఎల్‌ రాహుల్ దూరమైనా.. అతడి స్థానంలో ఆడేందుకు ఇషాన్ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ సిద్ధంగా ఉన్నారు. అందుకే, పంత్‌ని ఓపెనర్‌గా బరిలోకి దింపే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అహ్మదాబాద్‌లో పిచ్ నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా.. మిడిల్ ఆర్డర్‌ ఆటగాళ్లు మెరుగ్గా రాణించారు. శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌ వంటి యువ ఆటగాళ్లతో మిడిల్‌ ఆర్డర్‌ బలంగా ఉంది’ అని విక్రమ్‌ రాథోడ్‌ చెప్పాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో కెప్టెన్‌ రోహిత్‌తో కలిసి.. రిషభ్‌ పంత్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

* టీ20 ఫార్మాట్‌లో విండీస్‌ను తక్కువ అంచనా వేయలేం..

‘వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ ఓటమి పాలైనా.. టీ20 ఫార్మాట్‌లో ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. కచ్చితంగా గట్టి పోటీనిస్తుంది. యువ ఆటగాళ్లతో ప్రయోగాలు చేసేందుకు నేనెప్పుడూ సిద్ధమే. కానీ, సిరీస్ గెలవడం అంతకంటే ముఖ్యం’ అని విక్రమ్‌ రాథోడ్‌ పేర్కొన్నాడు. విండీస్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌లో పేసర్‌ అవేశ్ ఖాన్‌, లెగ్ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌లు భారత జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని