Virat Kohli: నన్ను క్రికెటర్‌లా చూడొద్దు!..ఫిట్‌నెస్‌ కోచ్‌తో విరాట్‌

భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి ఫిట్‌నెస్‌ పట్ల ఎంత అభిరుచి ఉందో అందరికీ తెలుసు. ఈ విషయంలో కోహ్లీకి ఉన్న నిబద్ధత గురించి ఆర్సీబీ ఫిట్‌నెస్‌ కోచ్‌ శంకర్‌ బసు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 

Published : 19 Mar 2023 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి(Virat Kohli) ఫిట్‌నెస్‌ పట్ల ఎంత అభిరుచి ఉందో అందరికీ తెలుసు.అది ఎంతోమంది క్రికెటర్లను ప్రభావితం చేసింది. వారు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించేలా స్ఫూర్తి నింపింది. ఫిట్‌గా ఉండటం పట్ల కోహ్లీకి ఉన్న నిబద్ధత గురించి ఆర్సీబీ(RCB) ఫిట్‌నెస్‌ కోచ్‌ శంకర్‌ బసు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 

ఆర్సీబీ పోడ్‌కాస్ట్‌ సీజన్‌2లో(RCB Podcast Season 2) బసు మాట్లాడుతూ..‘‘విరాట్‌ని నేను 2009 నుంచి చూస్తున్నాను. అలాంటి వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు. ఈ మాట నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అవుతుంది. 2014లో తన వెన్ను గట్టిగా ఉందని దానికోసం ఏమైనా చేయగలరా? అని అడిగాడు. అప్పుడు కేవలం ఆరు వారాల సమయమే ఉండటంతో పెద్దగా ఏం చేయలేకపోయాం. 2015లో మీరు ఇంకేదైనా చేయాలన్నాడు. దానికి నేను మీ శిక్షణలో చాలా మార్పులు చేయాల్సి ఉంటుందని చెప్పాను. చాలా ప్రశ్నలు అడిగి అనేక సార్లు చర్చించిన తర్వాత చివరికి ప్రారంభిద్దామన్నాడు. దీపికా పల్లికల్‌(Deepika Pallikal) ఒక స్క్వాష్‌ క్రీడాకారిణి. తనకు నేను శిక్షణనివ్వడం విరాట్‌ చూశాడు. అప్పటికి ఆమె టాప్‌10 లో దూసుకుపోతోంది. అప్పుడు విరాట్‌ నాతో ‘నన్ను ఒక క్రికెటర్‌గా చూడకండి. వ్యక్తిగత అథ్లెట్‌గా నాతో కలిసి పనిచేయండి’ అని చెప్పాడు. దాంతో నేను అతడికి ఒలింపిక్‌ అథ్లెట్‌లా శిక్షణనివ్వడం ప్రారంభించాను. అప్పటి నుంచి అతడిని నోవాక్‌ జకోవిచ్‌ (Novak Djokovic) అని పిలుస్తాను. అతడి అభిరుచి, ఉత్సాహం నా మనసును కదిలించేది. అది తనకోసం నేను మరింత కష్టపడేలా చేసేది. ప్రజలు ఒక వ్యక్తి రూపాన్ని చూసి ఫిట్‌గా ఉన్నారా లేదా అని నిర్ణయిస్తారు. కానీ అథ్లెట్ల ఫిట్‌నెస్‌ విభిన్నంగా ఉంటుంది. కోహ్లీ ఫిట్‌గా ఉన్నాడు. అలాగే కనిపిస్తాడు. నిజంగా అది అతడి అదృష్టం. అతడు చాలా శక్తివంతుడు. దినేశ్‌ కార్తిక్‌ కూడా అంతే. క్రికెట్‌ మైదానంలో అతడి దృఢత్వం చూస్తే నమ్మశక్యం కాదు. అతడు క్రికెట్‌లో ర్యాన్‌ గిగ్స్‌(Ryan Gigs)’’ అని వివరించాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు