‘మీ ఎజెండా కోసం నా పేరు లాగొద్దు’.. వారికి నీరజ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌!

Neeraj chopra: తన పేరును ఉపయోగించి పాక్‌ క్రీడాకారుడు అర్షద్‌పై విమర్శలు చేస్తున్న వారికి బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు.

Published : 26 Aug 2021 21:42 IST

దిల్లీ: ‘మీ వ్యక్తిగత ఎజెండాను అమలు చేసేందుకు నా పేరు వాడుకోవద్దు’’ అంటూ టోక్యో ఒలింపిక్స్‌ బంగారు పతక విజేత నీరజ్‌ చోప్రా హితవు పలికాడు. ఇటీవల నీరజ్‌ ఇచ్చిన ఇంటర్వ్యూ అనంతరం పలువురు నెటిజన్లు పాక్‌ క్రీడాకారుడు అర్షద్‌ నదీమ్‌పై విమర్శలు చేయడంపై ఈ విధంగా స్పందించాడు. తప్పుడు ప్రచారం కోసం తన పేరు వాడుకోవద్దని సూచించాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా గురువారం ఓ వీడియోను విడుదల చేశాడు.

టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్‌.. ఫైనల్స్‌కు ముందు పాక్‌ జావెలిన్‌ క్రీడాకారుడు అర్షద్‌ నదీమ్‌ నుంచి జావెలిన్‌ అందుకుని విసిరాడు. ఇదే విషయాన్ని ఇటీవల నీరజ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఫైనల్‌లో తొలిసారి విసరడానికి వెళుతున్నప్పుడు నా జావెలిన్‌ కనిపించలేదు. దాని కోసం వెతుకుతుండగా అర్షద్‌ చేతిలో కనిపించింది. దాన్ని అడగడంతో అతడు ఇచ్చేశాడు. తర్వాత నేను దానిని విసిరాను’’ అని చెప్పుకొచ్చాడు.

ఆ ఇంటర్వ్యూ అనంతరం పలువురు నెటిజన్లు అర్షద్‌పై విమర్శలు గుప్పించారు. నీరజ్‌ జావెలిన్‌ను అర్షద్‌ దొంగిలించేందుకు యత్నించడంటూ పలువురు కామెంట్లు పెట్టారు. పాక్‌ మరోసారి తన బుద్ధి బయటపెట్టుకుందంటూ ఆరోపించారు. అర్షద్‌పై విమర్శలు తన దృష్టికి రావడంతో నీరజ్‌ స్పందించాడు. ‘‘జావెలిన్‌ను ఎవరైనా వాడొచ్చు. అక్కడ తనదీ అంటూ ఉండదు. కానీ కొందరు నా పేరుతో తప్పుడు ప్రచారం చేయడం నా దృష్టికొచ్చింది. వారి ఎజెండా కోసం నా పేరును వాడుకుంటున్నారని తెలిసింది. దయచేసి అలాంటి తప్పుడు ప్రచారాలు ఆపండి. క్రీడలు కలిసుండాలని మాకు నేర్పుతాయి. మేం కూడా స్నేహంగా మాట్లాడుకుంటాం. ఈ ప్రచారం నన్నెంతో బాధించింది’’ అంటూ నీరజ్‌ చెప్పుకొచ్చాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని