IND vs SA: అక్కడ ద్రవిడ్‌ ఉన్నాడు.. టీమ్ఇండియా అంతగా ఈజీగా ఓడిపోదు..

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో  ఓటమిపాలై డీలాపడ్డ టీమ్‌ఇండియా మూడో టీ20లో పుంజుకుంది. తొలుత భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. భారత బౌలర్లు హర్షల్‌ పటేల్‌ 4, యుజువేంద్ర చాహల్‌

Published : 16 Jun 2022 02:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో  ఓటమిపాలై డీలాపడ్డ టీమ్‌ఇండియా మూడో టీ20లో పుంజుకుంది. తొలుత భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. భారత బౌలర్లు హర్షల్‌ పటేల్‌ 4, యుజువేంద్ర చాహల్‌ 3 వికెట్లతో విజృంభించడంతో సౌతాఫ్రికా 19.1 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమ్ఇండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్ ఉల్‌ హక్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. సీనియర్ ఆటగాళ్లు లేకున్నా ద్వితీయ శ్రేణి జట్టు అద్భుతంగా పోరాడుతోందన్నాడు. టీమ్ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ ఉన్నాడని, స్వదేశంలో భారత జట్టు అంత తేలికగా ఓడిపోదని ఇంజమామ్‌ పేర్కొన్నాడు.   

‘మూడో టీ20లో టీమ్‌ఇండియా గెలవడంతో సిరీస్‌లో ఆ జట్టు ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. స్వదేశంలో భారత జట్టు అంత సులభంగా ఓడిపోదు. కాబట్టి ఇప్పుడు ఒత్తిడి దక్షిణాఫ్రికాపై ఉంది.  పోరాట పటిమ ప్రదర్శిస్తున్న టీమ్‌ఇండియా యువ ఆటగాళ్లను అభినందించాలి. జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేరు. అయినా, వారు అద్భుతమైన విజయాన్ని సాధించగలిగారు. హర్షల్ పటేల్, చాహల్‌ బాగా బౌలింగ్‌ చేయడంతో ఇది సాధ్యమైంది. ఈ పోటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తొలుత, ఈ సిరీస్‌ని సౌతాఫ్రికా కైవసం చేసుకుంటుదని అనిపించినా దానిని భారత బౌలర్లు అడ్డుకున్నారు. ద్వితీయ శ్రేణి జట్టు పోరాడుతోంది. అది చూడటానికి చాలా బాగుంది. అండర్-19 జట్టుతో పనిచేసిన అనుభవం ఉన్న ద్రవిడ్ ఇప్పటికే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాడు. యువ ఆటగాళ్లతో ఎలా ఉండాలో అతనికి తెలుసు. అండర్‌-19 ఫార్ములానే ఇక్కడ అమలు చేస్తున్నాడు’ అని ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ వివరించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని