Dwaine Pretorius: ధోనీ.. ఏదైనా చేయగలనని నమ్ముతాడు: ప్రిటోరియస్

చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఏదైనా చేయగలననే నమ్మకంతో ఉంటాడని దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ ప్రిటోరియస్‌ అన్నాడు...

Published : 07 Jun 2022 10:51 IST

(Photo: Dwaine Pretorius Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఏదైనా చేయగలననే నమ్మకంతో ఉంటాడని దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ ప్రిటోరియస్‌ అన్నాడు. టీమ్‌ఇండియాతో ఐదు టీ20ల సిరీస్‌కు ముందు సోమవారం మీడియాతో మాట్లాడిన అతడు.. ధోనీ నుంచి పలు విషయాలు నేర్చుకోవాలని ఉందన్నాడు. ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో చెన్నై తరఫున ఆడిన ప్రిటోరియస్‌.. పలు సందర్భాల్లో ధోనీతో కలిసి బ్యాటింగ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో అతడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘ఎలాంటి స్థితిలోనైనా ధోనీ ప్రశాంతంగా ఉంటాడు. దేనికీ అతిగా స్పందించడు. అతనెంతో ఆశావహ దృక్పథంతో ఉంటాడు. ఏదైనా చేయగలనని నమ్ముతాడు. ఎలాంటి స్థితిలోనైనా మ్యాచ్‌ గెలుస్తామనే ధీమాతో ఉంటాడు. అవన్నీ నేను అతడి నుంచి నేర్చుకోవాలనుకుంటున్నా. అలాగే ఛేదనలో మ్యాచ్‌ ఆఖరి క్షణాల్లో బ్యాటర్లు ఒత్తిడిలో ఉండరని, అప్పుడు బౌలర్లే తీవ్ర ఒత్తిడికి గురవుతారనే విషయాన్ని నాకు తెలియజేశాడు. ఒక బౌలర్‌ ఆఖరి మూడు బంతుల్లో 18 పరుగులు కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లోనూ మ్యాచ్‌ ఓడిపోతారని, అదే బ్యాట్స్‌మన్‌గా అలాంటి స్థితిలో గెలవచ్చని అతడు అర్థమయ్యేలా చేశాడు’ అని దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ చెప్పుకొచ్చాడు.

‘అలాగే చెన్నై జట్టులో మంచి వాతావరణం ఉంటుంది. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తారు. భారత టీ20 లీగ్‌లో ధోనీసేనకు సుదీర్ఘ అనుభవం ఉంది. క్రికెట్‌లో ఎప్పుడూ మనకు అనుకూలమైన ఫలితాలు రావనే సంగతి అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు వైఫల్యాల నుంచి సానుకూల విషయాలను తెలుసుకొని భవిష్యత్‌ను మరింత బలోపేతంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. ఒక్క సీజన్‌లో విఫలమైనంత మాత్రాన మొత్తం కొంప మునిగిపోయినట్లు కాదు’ అని ప్రిటోరియస్‌ చెప్పాడు. ఇక టీమ్‌ఇండియాతో దక్షిణాఫ్రికా సిరీస్‌పై స్పందించిన అతడు.. ఈ సిరీస్‌లో తాను మంచి ప్రదర్శన చేసి పొట్టి ఫార్మాట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదగాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలోకి అడుగుపెట్టేముందు ఈ సిరీస్‌లో విజయం సాధించాలని ఉందన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని