Bravo - Kohli: కోహ్లీ నంబర్‌ 1.. గణాంకాలు అబద్ధాలు చెప్పవు: బ్రావో

భారత టీ20 లీగ్‌లో ఆటగాళ్ల మధ్య అనుబంధాలు ప్రత్యేకంగా ఉంటాయి. మైదానంలో ఎంత పోటీపడినా ఆఫ్‌ ది ఫీల్డ్‌లో సోదరభావంతో మెలుగుతారు...

Published : 07 May 2022 01:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌లో ఆటగాళ్ల మధ్య అనుబంధాలు ప్రత్యేకంగా ఉంటాయి. మైదానంలో ఎంత పోటీపడినా ఆఫ్‌ ది ఫీల్డ్‌లో సోదరభావంతో మెలుగుతారు. తాజాగా బెంగళూరు - చెన్నై జట్ల మధ్య జరిగిన పోరులో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. మ్యాచ్‌ అనంతరం చెన్నై సూపర్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీని మెచ్చుకుంటూ ఓ పోస్టు చేశాడు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం గమనార్హం.

ప్రస్తుత సీజన్‌లో కోహ్లీ మునుపటిలా పరుగులు చేయలేక తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క అర్ధశతకంతో 216 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడి బ్యాటింగ్‌పై సందేహాలు తలెత్తుతుండటంతో పాటు అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రావో.. కోహ్లీకి అండగా నిలుస్తూ పోస్టు చేశాడు. అందులో మూడు ఫొటోలు పంచుకున్న అతడు.. ‘జీవితాన్ని ఆస్వాదించండి. అలాగే గొప్ప వ్యక్తుల్ని అభినందించండి. కోహ్లీని గౌరవించండి. అతడో నంబర్‌ వన్‌ ఆటగాడు. నంబర్లు అబద్దాలు చెప్పవు. అతడు ఛాంపియన్‌’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. కాగా, దీనికి కోహ్లీ అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. 2 లక్షలపైనే లైకులు వచ్చాయి.

ఇక ఈ టోర్నీలో కోహ్లీ ప్రస్తుతం 218 మ్యాచ్‌ల్లో 6,499 పరుగులతో కొనసాగుతున్నాడు. దీంతో అత్యధిక పరుగుల వీరుడిగా టాప్‌లో నిలిచాడు. 36.51 సగటుతో 5 శతకాలు, 43 అర్ధశతకాలు సాధించాడు. అలాగే బ్రావో 159 మ్యాచ్‌ల్లో 181 వికెట్లు పడగొట్టి.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దూసుకుపోతున్నాడు. ఇక ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు సాధించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని