BAN vs NZ : కివీస్ గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రక విజయం

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ న్యూజిలాండ్‌ జట్టును సొంత గడ్డపైనే ఓడించి బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మౌంట్ మాంగనూయిలో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య కివీస్ జట్టును 8 వికెట్ల..

Updated : 05 Jan 2022 14:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ న్యూజిలాండ్‌ జట్టును సొంత గడ్డపైనే ఓడించి బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మౌంట్ మాంగనూయిలో జరుగుతోన్న తొలి టెస్టులో ఆతిథ్య కివీస్ జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించింది. న్యూజిలాండ్‌లో బంగ్లాకిదే తొలి టెస్టు విజయం కావడం విశేషం. ఇప్పటి వరకూ విదేశాల్లో 61 టెస్టులు ఆడిన బంగ్లాదేశ్‌ కేవలం ఆరు టెస్టుల్లోనే విజయం సాధించడం గమనార్హం.

బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతోన్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో.. బంగ్లాదేశ్ 458 పరుగులకు ఆలౌటైంది. మహ్మదుల్ హసన్‌ జాయ్‌ (78), షాంటో (64), మోమినుల్ (88), లిటన్‌ దాస్‌ (86) అర్ధ శతకాలతో రాణించడంతో బంగ్లా భారీ స్కోరు చేయగలిగింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు 328 పరుగులకు ఆలౌటైంది. డెవాన్‌ కాన్వే (122) శతకం, విల్ యంగ్‌ (52), హెన్రీ నికోల్స్‌ (75) అర్థ శతకాలతో రాణించినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాకు 130 పరుగుల ఆధిక్యం లభించింది. బంగ్లా బౌలర్‌ ఇబాదత్‌ 6 వికెట్లతో చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ న్యూజిలాండ్‌ 169 పరుగులకే కుప్పకూలింది. 40 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో కివీస్‌ గడ్డపై బంగ్లా చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్స్ న్యూజిలాండ్ జట్టుకు గత నాలుగేళ్లలో సొంత గడ్డపై ఎదురైన తొలి ఓటమి ఇదే.

‘న్యూజిలాండ్ గడ్డపై ఇప్పటి వరకు మేం ఒక్క విజయం కూడా సాధించలేదు. అందుకే, కివీస్ పర్యటనకు బయలుదేరే ముందే ఈ సారి చరిత్ర సృష్టించాలనుకున్నాం. న్యూజిలాండ్‌ జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌.. ప్రస్తుత పర్యటనలో మేం వారిని సొంత గడ్డపై ఓడిస్తే.. రాబోయే తరం ఆటగాళ్లు కూడా ఓడించగలరనే నమ్మకంతో బరిలోకి దిగాం. బహుశా, న్యూజిలాండ్‌ మమ్మల్ని తక్కువగా అంచనా వేసి ఉండొచ్చు. మేం అలాంటి ప్రతికూల ఆలోచనలను పట్టించుకోకుండా.. చాలా క్రమశిక్షణతో గెలుపు కోసం శాయశక్తులా శ్రమించాం’ అని బంగ్లా బౌలర్‌ ఇబాదత్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని