INDvsENG: టీమ్‌ఇండియాకు కాస్త ఊరట!

టీమ్‌ఇండియాకు కాస్త ఊరట లభించింది. వచ్చేనెల ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు ‘కౌంటీ సెలెక్ట్‌ XI‌’ జట్టుతో ఒక వార్మప్‌ మ్యాచ్‌ ఏర్పాటు చేయాలని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు భావిస్తోంది...

Published : 02 Jul 2021 19:02 IST

లండన్‌: టీమ్‌ఇండియాకు కాస్త ఊరట లభించింది. వచ్చేనెల ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు ‘కౌంటీ సెలెక్ట్‌ XI‌’ జట్టుతో ఒక వార్మప్‌ మ్యాచ్‌ ఏర్పాటు చేయాలని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. అందుకోసం సన్నాహకాలు చేస్తున్నట్లు బోర్డు ప్రతినిధి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ‘‘టెస్టు సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియాకు ‘కౌంటీ సెలెక్ట్‌ XI’ జట్టుతో మూడు రోజుల ఫస్ట్‌క్లాస్‌ వార్మప్‌ మ్యాచ్‌ ఆడించాలని బీసీసీఐ చేసిన అభ్యర్థన మాకు గుర్తుంది. కొవిడ్‌-19 నియమ, నిబంధనలను దృష్టిలో పెట్టుకొని మ్యాచ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. దీనిపై త్వరలోనే స్పష్టతనిస్తాం. ఇప్పుడు విహార యాత్రలకు వెళ్లిన కోహ్లీసేన జులై 15న దుర్హమ్‌లోని ఎమిరేట్స్‌ రివర్‌సైడ్‌లో రిపోర్టు చేయనున్నారు. ఆగస్టు 1 వరకు వారక్కడ సన్నద్ధమవుతారు. ఆపై నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానానికి చేరుకొని ఆగస్టు 4న తొలి టెస్టు ఆడతారు’ అని ఈసీబీ ప్రతినిధి చెప్పుకొచ్చారు.

అలాగే జులై 23 నుంచి ‘ది హండ్రెడ్‌’ లీగ్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ‘కౌంటీ సెలెక్ట్‌ XI’ జట్టులో ఎలాంటి ఆటగాళ్లు ఉంటారని మీడియా అడిగిన ప్రశ్నకు..‘ది హండ్రెడ్‌ లీగ్‌’లో ఆడని ఆటగాళ్లే భారత జట్టుతో తలపడతారని, అందులో నాణ్యమైన ఆటగాళ్లనే ఎంపికచేస్తామని ఆయన బదులిచ్చారు. మరోవైపు గతనెల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమిపాలైన నేపథ్యంలో.. అప్పుడు భారత జట్టుకు సరైన ప్రాక్టీస్‌ లభించలేదని, ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌తో పెద్దగా ఉపయోగం లేదని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తేరుకున్న బీసీసీఐ ఇప్పుడు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు ఓ ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ను ఏర్పాటు చేయాలని ఈసీబీని కోరింది. దాంతో ఆ బోర్డు ‘కౌంటీ సెలెక్ట్‌ XI జట్టు’తో ఆడించాలని నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని