Eng vs Ind: కోహ్లీ ఆట గురించి మాకు తెలుసు..బయట వ్యక్తుల మాటలు మేము పట్టించుకోము: రోహిత్‌ శర్మ

ఫేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న విరాట్ కోహ్లీ..తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ విఫలం అయ్యాడు. రెండో టీ20లో భారీ

Updated : 11 Jul 2022 11:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పేలవమైన ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న విరాట్ కోహ్లీ.. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ విఫలం అయ్యాడు. సిరీస్‌ రెండో మ్యాచ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి వికెట్‌ సమర్పించుకొన్నాడు. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో డేవిడ్‌ విల్లీ బౌలింగ్‌లో ఫ్లిక్‌ షాట్‌తో ఫోర్‌, స్ట్రయిట్‌ సిక్స్‌ కొట్టి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. అయితే, దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఆ తర్వాతి బంతికే రాయ్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 12పరుగులే చేయడం అభిమానులను నిరాశపర్చింది.   మూడో మ్యాచ్‌లో భారత్‌ 17 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే, అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడాడు. ముఖ్యంగా జట్టులో మార్పులు, విరాట్ ఫామ్‌ గురించి కొన్ని కీలక  వ్యాఖ్యలు చేశాడు.

‘‘టీమ్‌ఇండియా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో మేము పట్టించుకోవడం లేదు. అసలు నిపుణులెవరో నాకు తెలియదు. వారిని ఎందుకు అలా పిలుస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. వారు బయట నుంచి చూస్తున్నారు. టీమ్‌ఇండియాలో ఏమి జరుగుతుందో వారికి తెలియదు. మేము ప్రపంచకప్‌ లక్ష్యంగా ఒక జట్టును తయారు చేసుకొంటున్నాం.  అనేకసార్లు చర్చించిన అనంతరమే మార్పులపై నిర్ణయాలు తీసుకుంటోన్నాము. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాము. ఈ విషయాలన్నీ బయట వారికి తెలియవు’’ అని రోహిత్ సమాధానమిచ్చాడు.

విరాట్ ఫామ్‌ గురించి మాట్లాడుతూ..‘‘ప్రతి ఆటగాడు ఏదో ఒక సమయంలో ఫామ్‌ కోల్పోతాడు. ఆ తర్వాత పుంజుకొని తిరిగి ఫామ్‌లోకి వస్తాడు. అయితే, ఆటగాడి నాణ్యత ఎప్పుడూ తగ్గదు. కోహ్లీ ఫామ్‌కి సంబంధించి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నేను కూడా ఒక దశలో ఫామ్‌ కోల్పోయాను. చాలా మంది ఆటగాళ్లకు ఈ విధంగా జరిగింది. ఇదేమీ కొత్త కాదు. ఎంతోకాలంగా నిలకడగా రాణిస్తున్న ఆటగాడు ఒకటి లేదా రెండేళ్ల పాటు పరుగులు సాధించలేకపోతే అలా మాట్లాడకూడదు. అభిమానులు దీన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. కానీ, జట్టును నడుపుతున్న వారికి ఆ ఆటగాడి అవసరం, నాణ్యత తెలుసు’’ అని రోహిత్ విరాట్‌కు మద్దతిచ్చాడు. 

కోహ్లీ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించడం (కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమా? లేదా జట్టు యాజమాన్యం సూచనా?) అని అడిగినప్పుడు రోహిత్ స్పందిస్తూ..‘‘మేము ఒక నిర్దిష్టమైన విధానంలో ఆడాలనుకొన్నాము. దానికి ప్రతి ఆటగాడి సహకారం అవసరం. అలా అయితేనే ఫలితం సానుకూలంగా వస్తుంది. ఈ జట్టులో భాగమైన ఆటగాళ్లు అదనపు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సిరీస్‌లో మేము ఆ విధంగానే ఆడి గెలిచాము. ఈ ఆలోచనా విధానంతోనే టీమ్‌ఇండియా రాబోయే సిరీస్‌ల్లో కూడా ఆడుతుంది’ అని రోహిత్ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు