
ENG vs IND:వాళ్ల కంటే మా అమ్మే మెరుగ్గా ఆడుతుంది: జెఫ్రీ బాయ్‌కాట్
ఇంటర్నెట్ డెస్క్: స్వదేశం, విదేశం అనే తేడా లేకుండా అన్ని పిచ్‌లపై సత్తాచాటుతున్నాడు టీమ్‌ఇండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్. తనదైన బౌలింగ్ శైలితో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను ఉచ్చులోకి దించి బోల్తా కొట్టిస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లోనూ సిరాజ్ అదరగొడుతున్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో ఇటీవల ముగిసిన రెండో టెస్టులో 151 పరుగుల తేడాతో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది.
ఇక, ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించిన మహ్మద్ సిరాజ్‌ను ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్ ప్రశంసించాడు. సిరాజ్ దూకుడుకు ఎవరూ అడ్డుకట్టవేయొద్దని, అతడిని సహజ శైలిలో ఆడే విధంగా స్వేఛ్ఛనివ్వాలని భారత జట్టు యాజమన్యానికి సూచించాడు.
‘టీమ్‌ఇండియా దగ్గర అద్భుతమైన బౌలింగ్ దళం ఉంది. సిరాజ్ అంటే నాకిష్టం. అతడు మంచి ఉత్సాహాంతో ఉన్నాడు. ఏ విషయంలోనూ అతడిని నియంత్రించకండి. అతడి సహజ శైలిలో ఆడనివ్వండి. కొత్తవాడే అయినా, సిరాజ్ భారతదేశ ఆస్తి’ అని బాయ్‌కాట్ అన్నాడు.
ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీరుపై బాయ్‌కాట్ తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఇంగ్లాండ్ టాప్-3 బ్యాట్స్‌మెన్ కంటే తన తల్లి బాగా ఆడుతుందని విమర్శించాడు.‘ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీరు ఆందోళన కలిగిస్తోంది. మా జట్టులోని టాప్-3 బ్యాట్స్‌మెన్ కంటే మా అమ్మ బాగా ఆడగలదు. ఇది చాలా దురదృష్టకరం. టెక్నిక్ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం’ అని జెఫ్రీ బాయ్‌కాట్ వివరించాడు.