Moeen Ali: టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మొయిన్‌ అలీ

ఇంగ్లాండ్‌ జట్టు ఆల్‌రౌండర్‌ మోయిన్‌ అలీ(34) టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డ్‌(ECB) సోమవారం వెల్లడించింది.....

Published : 27 Sep 2021 17:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ జట్టు ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ(34) టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డ్‌(ECB) సోమవారం వెల్లడించింది. ఐసీసీ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. పొట్టి ఫార్మాట్‌లో మరికొన్నేళ్లు రాణించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా మొయిన్‌ అలీ పేర్కొన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఇప్పుడు నా వయసు 34. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వీలైనంత కాలం ఆడుతూ.. నా క్రికెట్‌ను ఆస్వాదించాలనుకుంటున్నాం. టెస్టు క్రికెట్‌ అద్భుతం. ఒక మంచి ఇన్నింగ్స్‌ ఆడితే.. కష్టపడి సాధించిన బహుమతిలా అనిపిస్తుంది. అన్ని ఫార్మాట్లకంటే ఉత్తమం. నా ఆట పట్ల సంతృప్తిగా ఉన్నా. ఈ ఫార్మాట్‌ను మిస్సవుతున్నా’ అని మొయిన్‌ అలీ పేర్కొన్నట్లు ఈసీబీ ప్రకటనలో తెలిపింది. ఈ ఆల్‌రౌండర్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

మొత్తంగా 63 టెస్టులు ఆడిన మొయిన్‌ ఆలీ.. 28.29 యావరేజ్‌తో 2,914 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ విశేషంగా రాణించాడు. టెస్టుల్లో మొత్తం 195 వికెట్లు తీశాడు ఈ రైట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌. 2017లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ విజయంలో అలీ కీలక పాత్ర పోషించాడు. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్‌లో 87 పరుగులతోపాటు బౌలింగ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 53 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. మిగతా మూడు టెస్టుల్లోనూ రాణించి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ కైవసం చేసుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని